అరుణాచల్ ప్రదేశ్ కావాలంటోన్న చైనా! 30 వేల వరల్డ్ మ్యాచ్‌లను తగలబెట్టేసింది...

china
వాసు| Last Updated: మంగళవారం, 26 మార్చి 2019 (17:04 IST)
దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ తమదేననీ... సౌత్ టిబెట్‌లో అది కూడా భాగమేనని చైనా వాదిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా అరుణాచల్ ప్రదేశ్, తైవాన్‌లను చైనాలో అంతర్భాగంగా చూపించడం లేదన్న అక్కసుతో చైనా కస్టమ్స్ అధికారులు తమ దేశంలో తయారైన 30 వేల ప్రపంచ పటాలను తగులబెట్టేశారు.

భారతదేశం నుంచి ఎవరైనా నాయకులు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించినప్పుడెల్లా చైనా తరచూ ఇదే అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటుంది. కాగా అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని అంతర్భాగమేననీ, దీనిపై తమకు శాశ్వత హక్కులు ఉన్నాయని భారత్ స్పష్టం చేస్తూనే వస్తోంది. దీంతో పాటు తరచూ దేశంలోని మిగతా ప్రాంతాలలాగానే అరుణాచల్ ప్రదేశ్‌కి కూడా భారతదేశ నేతలు పర్యటనలు చేస్తూంటారు.

కాగా 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలమధ్య ఇప్పటికి 21 పర్యాయాలు చర్చలు జరిగినప్పటికీ... పెద్దగా సఫలీకృతం కాలేదు.

మరోవైపు ద్వీప దేశం తైవాన్ కూడా తమదేనని డ్రాగన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని ఏదో దేశానికి ఎగుమతి చేయబడేందుకు తరలుతున్న ఈ మ్యాపులను చైనా కస్టమ్స్ అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. వీటిలో తైవాన్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొన్నారనీ, చైనా-భారత్ సరిహద్దు వివరాలు కూడా 'సరిగాలేవని' చెబుతూ దాదాపు 30 వేలకు పైగా వరల్డ్ మ్యాపులను డ్రాగన్ దేశం తగలబెట్టినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.దీనిపై మరింత చదవండి :