శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (15:35 IST)

చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్న ఈయూ

పాకిస్థాన్‌లో తలదాచుకొని భారతదేశంపై ఉగ్రదాడులు చేస్తున్న జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి మోకాలడ్డుతున్న చైనాకు చెంపపెట్టులాంటి నిర్ణయం ఒకటి తెర మీదకు వచ్చింది. మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) సిద్ధమవుతోంది. 
 
మసూద్‌పై చర్యకు భద్రతా మండలిలో అన్ని దేశాలు అంగీకరిస్తున్నప్పటికీ వీటో అధికారం ఉన్న చైనా పదేపదే మోకాలడ్డుతూండడంతో అతన్ని తమకు తాముగా ఉగ్రవాది జాబితాలో చేర్చాలని యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయించింది. గతవారం ఐక్యరాజ్య సమితిలో ఈ తీర్మానాన్ని ప్రస్తావించిన ఫ్రాన్స్‌ ఇప్పటికే తమ దేశంలో జైషే చీఫ్‌ను నిషేధించి... తమ దేశంలోని అతని ఆస్తులను స్తంభింపజేసింది.
 
ఈ దిశగా మిగిలిన దేశాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఎమాన్యుయేల్‌ మాక్రాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. యూనియన్‌లోని 28 సభ్య దేశాలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించింది. 2009, 2016 సంవత్సరాలతోపాటు ఇటీవలి యూఎన్‌ భద్రతా మండలిలో మసూద్ అజర్‌పై తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. ఇది జరిగిన కొద్దిరోజులకే యూరోపియన్‌ యూనియన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది అమల్లోకి వస్తే చైనా తీరుకు చెంపపెట్టే అనవచ్చు.