ఎల్ఈడీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్
విజయవాడ : ఎల్ఈడి బల్బుల వినియోగం... ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపేలా చేసింది. ఒకప్పుడు విద్యుత్ కోతలతో సతమతమైన ఏపీ ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇప్పుడు పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ నిరంతం విద్యుత్ సరఫరా
విజయవాడ : ఎల్ఈడి బల్బుల వినియోగం... ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపేలా చేసింది. ఒకప్పుడు విద్యుత్ కోతలతో సతమతమైన ఏపీ ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇప్పుడు పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ నిరంతం విద్యుత్ సరఫరా చేస్తోంది. మిగులు విద్యుత్‌ను పక్క రాష్ట్రాలకు విక్రయిస్తూ ఆదాయ వనరులను పెంచుకుంటోంది. స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రాం కింద కేంద్రం ఇస్తున్న ఎల్ఈడీ బల్బులతో... రాష్ట్రంలోని వీధుల్ని ప్రకాశవంతంగా మార్చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికెళ్లినా.. వీధులన్నీ ఎల్ఈడీ వెలుగులతో కాంతులీనుతున్నాయి. నగరం, పట్టణం, గ్రామీణం... ఇలా అన్ని ప్రాంతాల్లోని వీధులూ ఎల్ఈడీ వెలుగులతో కొత్త శోభను సంతరించుకున్నాయి.
ఈ బల్బుల వినియోగం వల్ల వెలుగులే కాదు...50 శాతానికి పైగా విద్యుత్ ఆదా కూడా అవుతోంది. దీంతో ప్రభుత్వం ఎల్ఈడీ లైట్ల వినియోగానికి ప్రాధాన్యతనిస్తోంది. అయితే, వీధులను మాత్రమే కాకుండా ఇళ్లను సైతం ఎల్ఈడీ లైట్లతో నింపేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇళ్లకు బల్బులను అందించడం ద్వారా విద్యుత్ పొదుపు చేసిన ప్రభుత్వం, తాజాగా ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్లను విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ అమ్మకాలను ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో అమలు చేస్తోంది. ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండడంతో, రాష్ర్టమంతటా ఈ గృహాపకరణాలను విద్యుత్ సబ్ స్టేషన్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎల్ఈడీ వినియోగంలో ఏపీ ఫస్ట్
విద్యుత్ పొదుపులో ఆంధ్రప్రదేశ్.. దేశానికే ఆదర్శంగా నిలిచింది. 10 రూపాయల వంతున ఒక్కో ఇంటికి రెండేసి ఎల్ఈడీ బల్బులు అందజేసే పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. అతి తక్కువ కాలంలోనే కోటీ 75 లక్షల ఇళ్లకు బల్బులు అందజేసింది. వీటి ద్వారా 421 మిలియన్ యూనిట్ల విద్యుత్తును పొదుపు చేయగలిగింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రాంతాల్లో వీధి లైట్లగా ఎల్ఈడీ బల్బులను అమర్చింది. దీనివల్ల రాష్ర్టానికి వంద కోట్ల రూపాయల్లో ఆదా అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 110 మున్సిపాలిటీల్లో వీధి లైట్లగా ఎల్ఈడీ బల్బులను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశం మొత్తంలో 10.48 లక్షల ఎల్ఈడీ వీధి లైట్లను అమర్చగా.. ఒక్క ఏపీలోనే 4.11 లక్షల బల్బులను అమర్చారు. అంటే, 40 శాతం బల్బులు ఆంధ్రప్రదేశ్ లోనే వినియోగిస్తున్నట్లు. విశాఖ కార్పొరేషన్లోనే రికార్డు స్థాయిలో 95,580 ఎల్ఈడీ వీధి లైట్లను అమర్చారు.
రాష్ర్టమంతటా బల్బులు, ఫ్యాన్ల విక్రయాలు...
ఎల్ఈడీ బల్బులకు లభించిన ఆదరణతో.. ఇకపై విద్యుత్ ను ఆదా చేసే గృహోపకరణాల వినియోగాన్ని అధికంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా లైట్ల తరువాత వినియోగదారులు అధికంగా వినియోగించే ఫ్యాన్లే. ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన ఫ్యాన్లను పంపిణీ చేయడం ద్వారా 20 శాతం విద్యుత్ ఆదా చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో ఇంటికి రెండేసి ఫ్యాన్లు పంపిణీ చేయడం ద్వారా.. భారీగా విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తోంది. కృష్ణా జిల్లాలో ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్ల విక్రయం కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఆ జిల్లాలో ఆదరణ లభించడంతో, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ర్టంలో 500 విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ కో, డిస్కం కార్యాలయాల ద్వారా 15 వాట్ల బల్బులను, ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్లను విక్రయించ నున్నారు. ఇదే విషయమై ఇటీవల నిర్వహించిన సమావేశంలో విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ జైన్...సంబంధిత చీఫ్ ఇంజనీర్లకు దిశనిర్దేశం చేశారు.
మరింత విద్యుత్ ఆదా...
ఇప్పటికే దేశంలో విద్యుత్ పొదుపులో ఏపీ అగ్రగామి నిలిచింది. తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ర్టాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లడం ఖాయం. ఇప్పటికే ఎల్ఈడీ బల్బుల వినియోగంతో రాష్ర్టంలో భారీగా విద్యుత్ ఆదా అవుతోంది. బల్బుల తరవాత విద్యుత్ వినియోగదారులు అధికంగా వినియోగించేవి ఫ్యాన్లే. ఎల్ఈడీ ఫ్యాన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే, విద్యుత్ భారీగా ఆదా చేయొచ్చునని ప్రభుత్వ ఆలోచన. దీంతో ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి శ్రీకారం చుడుతోంది. అదే సమయంలో రాష్ర్ట మంతటా ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. ఈ ఫ్యాన్ల వినియోగం పెరిగితే, మరింత విద్కుత్ ఆదా చేసుకోవొచ్చునని ట్రాన్స్ కో అధికారులు లెక్కలు వేస్తున్నారు.