1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (21:30 IST)

విజయవాడలో లైట్ మెట్రో... మంత్రి నారాయణ, పచ్చజెండా ఊపిన బాబు

అమరావతి: విజయవాడలో లైట్ మెట్రో ప్రజా రవాణా వ్యవస్థకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మెట్రో రవాణా వ్యవస్థ కంటే లైట్ మెట్రో వ్యవస్థ నిర్మాణ, నిర్వహ

అమరావతి: విజయవాడలో లైట్ మెట్రో ప్రజా రవాణా వ్యవస్థకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మెట్రో రవాణా వ్యవస్థ కంటే లైట్ మెట్రో వ్యవస్థ నిర్మాణ, నిర్వహణ ఖర్చుల్లో 25 శాతం వరకూ ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. నగరంలో 40 కిలో మీటర్ల మేర మూడు మార్గాల్లో లైట్ మెట్రో వ్యవస్థను అందుబాటులో తీసుకురానున్నామన్నారు. సచివాలయం నాలుగో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 
సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో లైట్ మెట్రోపై తుది నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. ఇప్పటికే పలువురు అధికారులతో కలిసి తాను చైనా, మలేషియాలో పర్యటించి, అక్కడి మెట్రో, లైట్ మెట్రోతో పాటు ఇతర ప్రజా రవాణా వ్యవస్థలపై అధ్యయనం చేశామన్నారు. దీనిపై ఆస్ట్రేలియాకు చెందిన ప్రజారవాణా రంగ నిపుణుడితో జర్మనీకి చెందిన జర్మన్ డెవలప్ మెంట్ బ్యాంకు(కెఎఫ్ డబ్య్లూ) ప్రతినిధులు 15 రోజుల పాటు విజయవాడ మెట్రోపై అధ్యయనం చేయించారన్నారు. 
 
రాబోయే 50 ఏళ్లలో విజయవాడలో పెరిగే జనాభాకనుగుణంగా చేసిన అధ్యయనంపై రూపొందించిన నివేదికను సీఎం చంద్రబాబునాయుడికి అందజేశామన్నారు. ఈ నివేదికలో విజయవాడకు లైట్ మెట్రో రవాణా వ్యవస్థ సరిపోతుందని పేర్కొన్నారన్నారు. ఇటువంటి లైట్ మెట్రో రవాణా వ్యవస్థ ఇండియాలోని గుర్గావ్‌లో ఉందని, అక్కడ ఆ వ్యవస్థ పనితీరును సీఎం చంద్రబాబుకు వివరించామని మంత్రి నారాయణ తెలిపారు. లైట్ మెట్రో పనితీరును పరిశీలించిన సీఎం చంద్రబాబునాయుడు... విజయవాడలో ఈ రవాణా వ్యవస్తే ఉత్తమమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. 
 
తక్షణమే లైట్ మెట్రోకు సంబంధించి, డీపీఆర్‌ను రూపొందించాలని మెట్రో ఎం.డి రామకృష్ణారెడ్డిని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. సాధారణ మెట్రో కంటే లైట్ మెట్రో నిర్మాణ, నిర్వహణ ఖర్చుల్లో 25 శాతంపైగా ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. మెట్రో నిర్మాణానికి కిలో మీటరుకు రూ.250 కోట్లు ఖర్చు అవుతుండగా, లైట్ మెట్రోకు రూ.170 కోట్లు మాత్రమే వ్యవయమవుతుందన్నారు. మెట్రో రైల్ నిర్వహణలో 3 బోగీలు అవసరమవుతాయన్నారు. 
 
రద్దీ పెరిగితే మరో 3 బోగీలు జత చేయాల్సి ఉంటుందన్నారు. అదే లైట్ మెట్రోకు 2 బోగీలు మాత్రమే అవసరమవుతాయని, ప్రయాణికుల సంఖ్య పెరిగే కొద్దీ అదనపు బోగీని ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. అలాగే, మెట్రో బోగీలో ఓకేసారి 250 మంది ప్రయాణిస్తే, లైట్ మెట్రోలో 200 మంది రాకపోకలు సాగించొచ్చునన్నారు. విజయవాడలో మూడు మార్గాల్లో 40 కిలో మీటర్ల మేర లైట్ మెట్రో నడపాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ వివరించారు. గతంలో 24.5 కిలోమీటర్ల వరకూ మెట్రో ను నడపాలని నిర్ణయించగా, ప్రస్తుతం లైట్ మెట్రోను అదనంగా గన్నవరం ఎయిర్ పోర్టుతో పాటు జక్కంపూడి కాలనీ వరకూ పొడిగించామన్నారు. గన్నవరంలో వర్కుషాప్, వర్కుషీట్ల నిర్వహణ కోసం 60 ఎకరాల మేర సేకరించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. ఇందుకు రూ.600 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామన్నారు.