సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

మద్యం ధరలపై మందుబాబుల ఫైర్

ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు ప్రజలకు భారం మోపడానికి, ప్రభుత్వ ఆదాయం పెంచుకోడానికా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు సూపర్‌వైజర్‌, సేల్స్‌మెన్‌గా నియమితులైన వారికి పూర్తి అవగాహన లేకపోవడం, ఆన్‌లైన్‌ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మద్యం విక్రయాల నిబంధనలు, ధరలు, నిర్దేశిత సమయాలతో దుకాణాల నిర్వహణ గందరగోళంగా మారింది. మద్యం దుకాణం సిబ్బంది, మందుబాబులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

8 గంటలకే దుకాణం మూసివేసినా సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్‌ వివరాలు నమోదుచేసి ఇంటికి వెళ్లడానికి అర్థరాత్రి దాటుతోంది. ఏరోజుకారోజు విక్రయాల అనంతరం అమ్మకాలు, స్టాక్‌ వివరాలు ప్రత్యేక యాప్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. సాంకేతిక సమస్య కారణంగా నమోదు కాకపోవడంతో సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 
సాంకేతిక సమస్య కారణంగా ప్రస్తుతానికి మాన్యువల్‌గా వివరాలు నమోదుచేయడానికి వెసులుబాటు కల్పించడం కాస్త ఉపశమనం కలిగించింది. కాగా మద్యం విక్రయించిన సొమ్ము ప్రభుత్వానికి అప్పగించడంలో కొందరు సూపర్‌వైజర్లు ఇబ్బందులు పడుతున్నారు. అర్థరాత్రి వేళ్ల ఇంటికి వెళుతున్న సూపర్‌వైజర్లు మద్యం విక్రయ సొమ్ము వెంట తీసుకెళ్లి మరుసటి రోజు బ్యాంక్‌లో జమ చేస్తున్నారు.

అర్థరాత్రి అంత సొమ్ము వెంట తీసుకెళ్లడంపై కొందరు భయపడుతున్నారు. రాత్రి దుకాణ సమయం ముగిసే సమయంలో బ్యాంక్‌ ఉద్యోగి నేరుగా దుకాణం వద్దకు వచ్చి సొమ్ము జమ చేసే విధానం అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు 8 గంటలకే దుకాణాలు మూసివేయడంపై మందుబాబులు కొన్ని దుకాణాల వద్ద వీరంగం వేస్తున్నారు.
 
కాగా ప్రభుత్వ మద్యం దుకాణ ఏర్పాటు వెనుక ఆదాయం ఆర్జన ప్రధాన ఉద్దేశమనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రైవేటు వ్యాపారులు నిర్దేశిత ధర (ఎమ్మార్పీ) కంటె అధికంగా వసూలు చేస్తే అధికారులు దాడులు చేసి చర్యలు తీసుకున్నారు.

ఇపుడు నేరుగా ప్రభుత్వమే నిర్దేశిత ధరకు మించి వసూలే చేయడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రభుత్వమే ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో లేని మద్యం రకాలు అధిక ధరలకు విక్రయించడం వారిని దోచుకోవడమే లక్ష్యంగా కనిపిస్తుందనే విమర్శలు లేకపోలేదు.
 
8 గంటలకు దుకాణాలు మూసివేస్తుండగా అదే సమయానికి ట్రాఫిక్‌, పోలీసు సిబ్బంది డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టడం ప్రభుత్వ నిబంధన సాకుతో మందుబాబుల జేబులు కత్తిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణాలు తొందరగా మూసివేయడం, అధిక ధరలు వసూలు చేయడం ప్రైవేటు బార్‌ నిర్వాహకులకు కలిసివచ్చింది.

కొన్నిచోట్ల బార్‌ యజమానులు అధిక ధరకు మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. కొన్ని బార్ల గతంలో విక్రయ దుకాణం అనుసంధానంగా ఉండేది. ప్రస్తుతం విక్రయ దుకాణానికి ఐరెన్‌ గ్రిల్స్‌ ఏర్పాటుచేసి నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగించడం బహిరంగ రహస్యం.
 
తగ్గిన అమ్మకాలు
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయాలు పరిశీలిస్తే నిరాశాజనకం. గతంలో భారీగా అమ్మిన దుకాణాలు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అనువుగాలేని సమయం, బీరు లభ్యం కాకపోవడంతో అమ్మకాలు తగ్గాయని అధికారులు అంటున్నారు.

కాగా మద్యం అధిక ధరలు, తక్కువ రకం అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లాలో మద్యం అమ్మకాలు 20 శాతం వరకు తగ్గినట్లు అంచనా.