డ్రగ్స్ తీసుకున్నా శిక్షార్హమే కానీ తప్పించుకునే వెసులుబాటు చాలానే ఉంది..
మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలకు గురైన తెలుగు చిత్రపరిశ్రమ భీతిల్లుతోంది కానీ డ్రగ్స్ తీసుకున్నంత మాత్రాన వారు విక్రేతలు కారు కాబట్టి విచారణ సాగినా న్యాయస్థానాలు వారి పరిస్థితిని సానుకూలంగా చూసే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలకు గురైన తెలుగు చిత్రపరిశ్రమ భీతిల్లుతోంది కానీ డ్రగ్స్ తీసుకున్నంత మాత్రాన వారు విక్రేతలు కారు కాబట్టి విచారణ సాగినా న్యాయస్థానాలు వారి పరిస్థితిని సానుకూలంగా చూసే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మాదకద్రవ్యాల కేసుల్ని విచారించే ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985 (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్) చట్టం డ్రగ్స్ వాటి వరిమాణం, వినియోగదారులు, విక్రేత (ఫెడ్లర్) వంటి చాలా నిర్వచనాలు ఇచ్చింది. ఈ చట్టం రెండు రకాల ప్రత్యామ్నాయాలు ఇస్తోంది. ఒకవైపు డ్రగ్స్‌కు బానిసలైన వారు మారేందుకు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో డ్రగ్‌తో దొరికితే మరణశిక్ష విధించడానికి ఈ చట్టంలో వీలుంది.
ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఆరోపణలకు గురైనవారికి అవగాహన లేకనే అనవసరంగా భీతిల్లుతున్నారనిపిస్తోంది. ఎందుకంటే ఇంతవరకు సినీపరిశ్రమలో డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చిన వారు డ్రగ్స్ నిల్వ చేసుకున్నట్లు ఆదారాలు లభించలేదు. ఇదే వారిని కాపాడే తారకమంత్రం అవుతుంది. ఈ చట్టం డ్రగ్స్‌ని తీసుకోవడానికి, అమ్మడానికి, వ్యాపారంలో భాగం కావడానికి మధ్య తేడాను స్పష్టంగా వివరించింది. దీనిప్రకారం..
ప్రాథమికంగా డ్రగ్‌ను కలిగి ఉండో, విక్రయిస్తోనో, సేవిస్తూనో చిక్కిన వారిని మాత్రమే అరెస్టు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. తక్కువ పరిమాణంలో మాదకద్రవ్యంతో చిక్కిన వారిని వినియోగదారులుగా పరిగణించే అవకాశం ఉంది. ఏ డ్రగ్, ఎంత మొత్తంలో దొరికితే వినియోగదారుడిగా పరిగణించాలి అనేది దర్యాప్తు అధికారి విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
మాదకద్రవ్య వినియోగదారులపై ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 27 కింద కేసు నమోదు చేస్తారు. ఈ నిందితులు న్యాయస్థానంలో హాజరైనప్పుడు తాము బానిసలయ్యామని, మార్పునకు అవకాశం ఇవ్వమని కోర్టును కోరే ఆస్కారం ఉంది. ఇలా వేడుకున్న సందర్భాల్లో న్యాయస్థానం ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 64 (ఏ) కింద వారికి ఓ అవకాశం ఇస్తుంది. తద్వారా రీహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్ళి మారడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
రక్తం, మెదడుపై మాత్రమే ప్రభావం చూపించే వాటిని నార్కోటిక్స్ అంటారు. ఈ తరహాకు చెందిన కన్నాబీస్ (గంజాయి మొక్క) ఉత్పత్తులతో చిక్కిన వారిపై అధికారులు ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 20 కింద కేసు నమోదు చేస్తారు. గంజాయి, హాష్, భంగు, ఆశిష్, చెరస్ ఇవన్నీ కన్నాబీస్ నుంచే వస్తాయి. వీటితోపాటు సహజ ఉత్పత్తుల ఆధారంగా తయారయ్యే కొకైన్, బ్రౌన్‌షుగర్, హెరాయిన్, మార్ఫిన్ వంటి వాటినీ నార్కోటిక్ డ్రగ్స్ కిందే పరిగణిస్తారు. వీటికి సంబంధించి అధికారులు ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 21 కింద కేసు నమోదు చేస్తారు.
కొకైన్ 500 గ్రాములు అంత కంటే ఎక్కువ, నల్లమందు 10 కేజీలు అంతకంటే ఎక్కువ, హెరాయిన్, మార్ఫిన్‌లు కేజీ అంతకంటే ఎక్కువ మోతాదుతో చిక్కిన వారికి ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం మరణశిక్ష పడటానికీ ఆస్కారం ఉంది.
ఈ వివరాలను చూస్తే డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవుతున్నవారు అరెస్టుల పాలైనప్పటికీ మరీ అంతగా భయపడాల్సిన పని లేదని వీరు చట్టం కోరలనుంచి, కఠిన శిక్షలనుంచి తప్పించుకునే అవకాశమే ఉంది.