శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (10:04 IST)

సమాచార కమిషన్ పరిధిలో పోస్టుల భర్తీకి చర్యలు: ఏపి సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్‌కు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు.

విజ‌య‌వాడ‌లోని ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఇన్ఫర్‌మేషన్ కమిషన్ కమిషనర్లు, చీఫ్ ఇన్ఫర్‌మేషన్ కమిషనర్ పి.రమేష్‌కుమార్, సమాచార హక్కు కమిషనర్లు యం.రవికుమార్, బి.వి.రమణకుమార్, కె.జనార్ధనరావు, ఐలాపురం రాజా, ఆర్.శ్రీనివాసరావులు ప్రధాన కార్యదర్శిని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్ర సమాచార కమిషన్ పరిధిలోని పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమాచార హక్కు కమిషన్ కార్యాల‌యానికి సాంకేతికప‌‌ర‌మైన సహాయ సహకారాన్ని అందించేందుకు ఐటి విభాగానికి, జిఏడిలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్‌కు అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ ఇన్ఫర్‌మేషన్ కమిషనర్ పి.రమేష్‌కుమార్ అన్ని ప్రభుత్వ శాఖలు వారి వెబ్‌సైట్‌లో కమిషన్ సూచించిన నివేదికలను పొందుపరిచేలాగా చూడాలని, ఎప్పటికప్పుడు డేటాను అప్‌లోడ్ చేయాలని కోరారు.

సమాచార హక్కు కమిషన్ పరిధిలోని కొన్ని మార్గదర్శకాలను రూపొందించడం జరుగుతోందని ఆయన ప్రధాన కార్యదర్శికి వివరించారు. సమావేశంలో రాష్ట్ర ఇన్ఫర్‌మేషన్ కమిషనర్‌తో పాటు లా కార్యదర్శి సి.బి.సత్యనారాయణ, జాయింట్ సెక్రటరి ఇ.సుజాత పాల్గొన్నారు.