బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (09:50 IST)

ఏలూరు కాలువపై జ‌ల కాలుష్యం నియంత్ర‌ణ‌కు చర్యలు: ఆదిత్యానాథ్‌ దాస్

ఏలూరు కాలువపై జ‌ల కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖతో సహా సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్‌ దాస్ ఆదేశించారు. గత డిసెంబ‌మ‌రులో ఏలూరు పరిసర ప్రాంతాల్లో అకస్మాత్తుగా మూర్చ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలతో సుమారు 622 మంది ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది.

ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర స్థాయిలో ఒక మల్టీ డిసిప్లెనరీ కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీ ఏలూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తేవడం జరిగింది.

ఈ కమిటీ అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన సమావేశమై ఘటనకు సంబంధించి వివిధ సంస్థలు ఇచ్చిన నివేదికలపై చర్చించడంతోపాటు తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ.. ఏలూరు కాలువపై తక్షణం కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోను కార్లు, తదితర వాహనాల వాషింగ్‌కు అనుమతించవద్దని స్పష్టం చేశారు.

మరో ఆరు మాసాల వరకూ తాగునీరు తదితర టెస్టులను కొనసాగించాలని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.

ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న మంచినీటి సరఫరా వ్యవస్థ పైపులైన్లను పూర్తిగా తనిఖీ చేసి సక్రమంగా ఉండేలా చూడాలని చెప్పారు. రైతులు వినియోగించే ఎరువులు, పురుగు మందులు నాణ్యత ఉండేలా చూడడంతో పాటు ఎప్పటికప్పుడు టెస్టులు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు.

తొలుత ఈ ఘ‌టనకు సంబంధించి ఎయిమ్స్, ఐఐసిటి, నీరి తదితర జాతీయ సంస్థలు అందించిన పరిశోధన నివేదికలు సిఫార్సులపై సిఎస్ అధికారులతో సమీక్షించి ఆయా సిఫార్సులను ఏవిధంగా పటిష్టంగా అమలు చేయాలనే దానిపై చర్చించారు.

రైతుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్, నాచురల్ ఫార్మింగ్ పట్ల ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఏలూరు కాలువపై జలకాలుష్యం నివారణకు పూర్తి స్టడీ నిర్వహించి అవసరమైన కార్యాచరణను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.