శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2016 (18:37 IST)

తెలుగు పాఠ్యపుస్తకాల్లో సత్య నాదెళ్ల.. మల్లి మస్తాన్‌ బాబు జీవిత చరిత్ర

ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంపిణీ చేసే తెలుగు పాఠ్య పుస్తకాల్లో మైక్రోసాప్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచంలోని ఏడు ఎతైన శిఖరాలను అధిరోహించిన స్వర్గీయ మల్లి మస్తాన్‌ బాబు జీవితాలు పాఠ్యాంశాలుగా చోటుచేసుకోనున్నాయి. 
 
వచ్చే విద్యా సంవత్సరం జూన్‌ 2016 నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల తెలుగు ఉపవాచక పుస్తకంలో 'స్ఫూర్తిప్రదాతలు'  అనే శీర్షికతో కొత్త పాఠాలను చేర్చింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిసర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ చర్యలు తీసుకుంటోంది. 
 
ఎనిమిదో తరగతి తెలుగు ఉపవాచకంలో సత్య నాదెళ్లతో పాటు ప్రపంచంలోని ఏడు ఎతైన శిఖరాలను అధిరోహించిన స్వర్గీయ మల్లి మస్తాన్‌ బాబు, ప్రఖ్యాత రచయిత, చిత్రకారుడు స్వర్గీయ సంజీవ్‌దేవ్‌ జీవిత కథలను కూడా చేర్చనున్నారు. 
 
అలాగే ఏడో తరగతి తెలుగు ఉపవాచకంలో కూచిపూడితో పాటు హరికథ, బుర్రకథ, తప్పెటగుళ్లు వంటి జానపద కళలను తెలియచేసే విధంగా పాఠ్యాంశాలను చేర్చనున్నారు. పదో తరగతి విద్యార్థులకు కూడా 'మన రాజధాని' అనే శీర్షికతో అమరావతి చరిత్రను, ప్రాముఖ్యాన్ని తెలియచేసే అంశాలను ఉపవాచకంలో చేరుస్తున్నట్లు ఏపీఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాజ్యలక్ష్మి వెల్లడించారు.