గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2024 (20:48 IST)

వృద్ధురాలి శవం దగ్గరకు మంత్రి జోగి రమేష్: అయ్యా ఇక్కడేమీ మాట్లాడొద్దంటూ బాధితులు విజ్ఞప్తి

Jogi Ramesh at old woman dead body
ఏపీ ఎన్నికల నియామవళి అమలులో భాగంగా వాలంటీర్లను విధులకు దూరంగా వుండాలని తెలియజేసిన సంగతి తెలిసిందే. సచివాలయ వాలంటీర్లు అందుబాటులో వుండరు కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటవ తేదీన అందాల్సిన పెన్షన్లు రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం సచివాలయాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయాన్నే డబ్బులు ఇస్తాం రమ్మని చెప్పి బ్యాంకు నుంచి ఇంకా రాలేదని తిప్పి పంపించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
 
ఈరోజు కృష్ణ జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి జోగి రమేష్ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో వైసిపి మద్దతుదారులు... డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేసారు. పెన్షన్ రానందునే వృద్ధురాలు మరణించిందని ఆరోపించారు.
 
ఐతే మృతురాలి కుటుంబ సభ్యులు వారక్కడ నినాదాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వృద్ధురాలు చనిపోయిన దుఃఖంలో తాము వుంటే ఇక్కడ రాజకీయాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. దయచేసి ఇక్కడేమీ మాట్లాడవద్దనీ, ఏదైనా వుంటే దూరంగా వెళ్లి మాట్లాడుకోమని చెప్పడంతో వైసిపి మద్దతుదార్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.