బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (14:36 IST)

పవన్‌ కళ్యాణ్‌కు పోలీసుల నోటీసులు.. బాధ్యతారాహితంగా మాట్లాడితే చర్యలు

jashuva - pedana
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా బుధవారం జిల్లాలోని పెడన నియోజకవర్గంలో పవన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే, ఈ సభలో రాళ్ల దాడి చేయించేందుకు వైకాపా ప్లాన్ వేసిందంటూ పవన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఇవి రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో పవన్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు పంపించారు. అయితే, తమ నోటీసులకు పవన్ రిప్లై ఇవ్వలేదంటూ జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. పైగా, బాధ్యతారహితంగా మాట్లాడితే పర్యావసనాలు ఉంటాయని హెచ్చరించారు. 
 
పెడనలో జనసేన నిర్వహించబోతున్న సభలో గూండాలు, క్రిమినల్స్ ద్వారా రాళ్లదాడి, గొడవలు చేయించేందుకు వైకాపా ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసిందని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. పైగా శాంతిభద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర డీజీపీతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి వుంటుందని అన్నారు. 
 
ఈ నేపథ్యంలో పవన్‌కు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై జిల్లా ఎస్పీ జాషువా మాట్లాడుతూ, తమ నోటీసుకు పవన్ నుంచి రిప్లై రాలేదని చెప్పారు. పెడనలోని తోటమూల సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు పవన్‌కు అనుమతి ఇచ్చామన్నారు. ఈ సభకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే, పవన్ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే తాము చర్యలు తీసుకుంటామన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరిదాన్నారు. బాధ్యతారహితంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.