శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ఇదీ వందే భారత్ రైళ్ల తీరు.. ఆహారంలో బొద్దింక

cockoach in train food
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అందుబాటులోకి తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ రైళ్ల పనితీరు పేరు గొప్ప.. ఊరి దిబ్బ అనే సామెతగా ఉంది. ఇటీవల ఓ గేదెను ఢీకొన్న వందేభారత్ రైలు ముందు డోమ్ ఊడిపోయింది. మరో రైలు భారీ వర్షానికి లోపలి భాగం అంతా తడిసిపోయింది. ఇపుడు ఈ రైళ్లలో సరఫరా చేసే ఆహారంలో పురుగులు వస్తున్నాయి. ఈ నెల 24వ తేదీన ఓ వందే భారత్ రైలులో సరఫరా చేసిన ఆహారంలో బొద్దింక వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 24వ తేదీన భోపాల్ నుంచి గ్వాలియర్‌కు సుభోద్ పహలాజ్ అనే ప్రయాణికుడు వందే భారత్ రైలులో ప్రయాణించాడు. రైల్లో తనకు ఇచ్చిన చపాతీల్లో బొద్దింక కనబడటంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే దాన్ని ఫొటో తీసి నెట్టింట్లో షేర్ చేస్తూ ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేశారు. 'వందేభారత్ రైల్లో నాకు ఇచ్చిన ఆహారంలో బొద్దింక కనిపించింది' అని ట్వీట్ చేశారు.
 
ఈ ఫిర్యాదుపై రైల్వే వెంటనే స్పందించింది. ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పిన రైల్వే శాఖ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. పీఎన్ఆర్ నెంబర్, ఇతర వివరాలను నేరుగా మెసేజ్ చేస్తే తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇలాంటి ఘటనలను అస్సలు సహించబోమని ఐఆర్సీటీసీ పేర్కొంది. ప్రయాణికుడికి ఐఆర్సీటీసీ ఆ తర్వాత మరో పార్శిల్ ఏర్పాటు చేసినట్టు భోపాల్ డివిజన్ రైల్వే మేనేజర్ తెలిపారు. ఆహార సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై తగు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.