శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2024 (10:22 IST)

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

mla sitakka
భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో రైతులు వరిపంట వేయడానికి వీల్లేదని, వరి పంట వేస్తే ఉరితో సమానమంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారని రాష్ట్ర మంత్రి సీతక్క తాజాగా విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఓ రైతుకు బేడీలు వేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలను కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతూ బీఆర్ఎస్ నేతలపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. రైతులు వరి వేస్తే ఉరి అన్నారనీ గుర్తుచేశారు. కౌలు రైతులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదంటూ మండిపడ్డారు. కౌలు రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు. 
 
భూములపై సమగ్ర సర్వే జరగాలన్నారు. రూ.5 లక్షల జీతం తీసుకునే వాళ్లు కూడా రైతుబంధు పొందుతున్నారని తెలిపారు. రైతుల ముసుగులో రైతుబంధు తీసుకున్నారనీ, వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతుబంధు రాలేదన్నారు. 
 
భారాస ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి అంటూ వ్యాఖ్యానించారు. పట్టాలేని ఎంతో మంది రైతులకు రైతు బంధు రాలేదన్నారు. బీఆర్‌ఎస్‌ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ మాత్రమేనని ఆమె విమర్శించారు. భూమి లేని పేదలకు బీఆర్‌ఎస్‌ ఏం చేసిందంటూ మంత్రి సీతక్క నిలదీశారు.