ఎమ్మెల్యే జోగి రమేష్ అరెస్ట్ ... పోలీసులే బుద్ధాని కొట్టారు...
ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత, ఎమ్మెల్యే జోగి రమేష్ అరెస్ట్ తో చల్లారింది. అయితే, ఈ రాద్ధాంతంలో ఎమ్మెల్సీని పోలీసులు కొట్టారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు.
సమాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో ప్రధాన ద్వారం ముందు జోగి రమేశ్, వైకాపా కార్యకర్తలు బైఠాయించారు. దీంతో తెదేపా- వైకాపా కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల నినాదాలతో తోపులాట జరిగింది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు యత్నించే క్రమంలో లాఠీఛార్జ్ చేశారు.
వైకాపా ఆందోళన సమాచారం తెలుసుకున్న పలువురు తెదేపా నేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తోపాటు బుద్దా వెంకన్న, పట్టాభి తదితరులు అక్కడికి వచ్చి వైకాపా నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బుద్దా వెంకన్న సొమ్మసిల్లిపడిపోయారు. ఆందోళనకారుల దాడిలో ఎమ్మెల్యే జోగి రమేశ్ కారు అద్దం ధ్వంసమైంది.
పోలీసులు వైసీపీ నేతలకే వత్తాసు పలికారని టీడీపీ నేత బుద్దా వెంకన్నఅన్నారు. సమాచారం లేకుండా వైసీపీ నేతలు ఆందోళనకు వచ్చారని, చంద్రబాబు నివాసానికి చేరుకున్న టీడీపీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు నివాసానికి చేరుకున్న ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న, పట్టాభి రామ్, నాగుల్ మీరా వైసీపీ నేతలని తప్పుపట్టారు. బుద్దా వెంకన్న, జోగి రమేష్ మధ్య తోపులాట జరిగింది. ఘర్షణలో సొమ్మసిల్లి పడిపోయిన బుద్ధా వెంకన్నను పోలీసులే కొట్టారని ఆరోపిస్తున్నారు. చివరికి జోగి రమేష్‍ను అదుపులోకి తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. పోలీసులు మంగళగిరి పీఎస్‍కు జోగి రమేష్ ను తరలించారు.