కాపులు ఇప్పుడు గుర్తొచ్చారా నాన్నా.. ఇటు బోండాను అటు పవన్‌ను కడిగేసిన ముద్రగడ
కాపుల సమస్యలపై దాదాపు ఒంటరిపోరు చేస్తున్న ముద్రగడ తాజాగా టీడీపీ ఎమ్మల్యే బోండా ఉమామహేశ్వరరావు కాపురాగాన్ని ఎత్తుకోవడంతో మండిపడ్డారు. మంత్రి పదవి ఇవ్వక పోయేసరికి కాపులు గుర్తుకొచ్చారా తమరికి అంటూ ధ్వజమెత్తారు.
ఒక దెబ్బకు రెండు పిట్టలన్నది పాత సామెత. ఇప్పుడు మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తుపాకి ఎత్తకుండానే రెండు పిట్టల పని పట్టారు. కాపుల సమస్యలపై దాదాపు ఒంటరిపోరు చేస్తున్న ముద్రగడ తాజాగా టీడీపీ ఎమ్మల్యే బోండా ఉమామహేశ్వరరావు కాపురాగాన్ని ఎత్తుకోవడంతో మండిపడ్డారు. మంత్రి పదవి ఇవ్వక పోయేసరికి కాపులు గుర్తుకొచ్చారా తమరికి అంటూ ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే బోండా లాంటి వారి చేత తమను నిత్యం తిట్టించటమే చంద్రబాబు లక్ష్యంగా ఎంచుకున్నారన్నారని కానీ మంత్రిపదవి ఇవ్వకుండా పోయేసరికి బోండాకు ఇప్పుడు కాపులు అనేవారు ఏపీలో ఉన్నారని ముద్రగడ ఎద్దేవా చేసారు. అధికార పార్టీలోని కాపు ప్రజాప్రతినిధులంతా చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఇప్పటికైనా గుర్తించాలని ఆయన సూచించారు.
పనిలో పనిగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ని కూడా ముద్రగడ ఆడుకున్నారు. కాపు ఉద్యమానికి పవన్ కల్యాణ్ ఏనాడూ సహకరించలేదని తెలిపారు. కాపు ఉద్యమానికి దూరంగా ఉన్న పవన్‌కళ్యాణ్ లాంటి వారిని బతిమిలాడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలపాలని పవన్‌కళ్యాణ్‌కి గతంలో ఆహ్వానం పంపినా స్పందించలేదని పేర్కొన్నారు. కొంతమంది రానంత మాత్రన తమ ఉద్యమం ఆగిపోదని స్పష్టం చేశారు.
మంత్రిపదవి ఇవ్వకపోయేసరికి కాపురాగాన్ని ఎత్తుకున్న బోండాను, కాపు ఉద్యమానికి ఏరోజూ సహకరించని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ని ఒక రేంజిలో ముద్రగడ కడిగేశారు. అధికారంలోకి రాగానే ఆరునెలల్లో కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని, ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య అందిస్తామని , ఏటా రూ.వెయ్యికోట్ల నిధులు మంజూరు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించిన చంద్రబాబు హామిలను తుంగలో తొక్కి కాపులను దారుణంగా మోసగించారని విమర్శించారు.