సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (15:58 IST)

పోలవరానికి నాబార్డు తొలిదశ రుణం.. చంద్రబాబు చేతికి రూ.1981 కోట్ల చెక్కు

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టనున్న పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టనున్న పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు తొలి దశ రుణాన్ని అందజేసింది. ఢిల్లీలోని ఇండియా హాబిటేట్‌ సెంటర్‌లో జరిగిన నాబార్డు సమావేశంలో ఈ నిధులకు సంబంధించిన రూ.1981 కోట్ల చెక్కును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ఏపీ సీఎం చంద్రబాబు అందుకున్నారు. నాబార్డు, నీటిపారుదల మంత్రిత్వశాఖల సంయుక్త సమావేశంలో కేంద్రం భరించే మొత్తంలో నాబార్డు తొలి దశకింద రూ.1981 కోట్ల మొత్తం చెక్కును చంద్రబాబుకు అందజేశారు. 
 
ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు దేశంలో పెద్ద ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. 2018 నాటికి ప్రధాన డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 11సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించాననీ, ప్రతి సోమవారం పోలవరంపై సమీక్షిస్తున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు నిధులు సమకూర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
నదుల అనుసంధానం కోసం మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి హయాంలో టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటుచేశారన్నారు. అయితే దాన్ని యూపీఏ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వచ్చిందన్నారు. వ్యవసాయరంగంలో బీమాపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిసారించారన్నారు. 2018 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి ప్రపంచంలోనే అతిత్వరగా పెద్దప్రాజెక్టు పూర్తిచేసిన రికార్డును సొంతం చేసుకుంటామని హామీ ఇచ్చారు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో కరవును అధిగమించొచ్చని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 
 
అనంతరం కేంద్ర మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారన్నారు. సీఎం ఎప్పుడు పిలిస్తే అప్పుడు తన బృందంతో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. పోలవరం నిధుల సాధన విషయంలో సుజనా చౌదరి ఎంతో చొరవ చూపారన్నారు. పోలవరం సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా 80 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా ఉందన్నారు.