శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (11:51 IST)

హైవేపై 100 కిమీ వేగంతో వెళ్లాలని చెప్పి... ఆయనేమో 160 కిమీ వేగంతో నడిపారు...

రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఇతరులకు చెప్పిన జాగ్రత్తలు, ఇచ్చిన సలహాలు పాటించివున్నట్టయితే ఖచ్చితంగా ఆయన ప్రాణాలతోనే ఉండేవారు.

రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఇతరులకు చెప్పిన జాగ్రత్తలు, ఇచ్చిన సలహాలు పాటించివున్నట్టయితే ఖచ్చితంగా ఆయన ప్రాణాలతోనే ఉండేవారు. ఇటీవల డ్రైవర్ ఉద్యోగం కోసం తన వద్దకు వచ్చిన ఓ యువకుడిని ఎంపిక చేసి.. హైవేపే 100 కిలోమీటర్ల వేగం, సిటీలో 80 కిలోమీటర్లలోపు వేగంతో వెళ్లాలని షరతు విధించాడు. కానీ, ఆయన మాత్రం ఆ షరతులు పాటించలేదు. ఫలితంగా ఆయన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
 
ఇటీవల తనకు ఓ మంచి డ్రైవర్‌ కావాలని 15 రోజుల కిందట బోథన్‌కు చెందిన టీడీపీ సీనియర్‌ నేత ఎం.అమర్‌నాథ్‌బాబుకు హరికృష్ణ కబురు పంపారు. తనకు తెలిసిన ఒక యువకుడిని ఆయన పంపించారు. అతని బయోడేటాను తీసుకున్న హరికృష్ణ, మళ్లీ పిలిపిస్తానని చెప్పి పంపించారు. ఆ యువకుడి జన్మ నక్షత్రం, జాతకం పరిశీలించిన హరికృష్ణ, ఆయన జాతకరీత్యా స్థిరత్వం ఉండదని భావించారు. దీంతో ఆ యువకుడిని మరోసారి పిలిపించారు. 
 
ప్రతి రోజు తనను ఇంటి వద్ద దింపాక హోటల్‌లోనే పడుకోవాలని, హైవేపై 100 కిలో మీటర్లు, సిటీలో 80 కిలో మీటర్లలోపు వేగంతోనే వెళ్లాలని చెప్పారు. ఈ షరతులకు లోబడి ఉంటానంటే విధుల్లో చేరాలని సూచించారు. ఆ యువకుడికి ఈ షరతులు నచ్చకపోవడంతో మళ్లీ రాలేదు. బహుశా అతను వచ్చి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదేమోనని అమర్‌నాథ్‌ బోరున విలపిస్తూ చెప్పుకొచ్చారు. 
 
బుధవారం ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కారు బోల్తా పడి చనిపోయిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆయన ఫార్చ్యూనర్ కారు ఏకంగా 160 కిలోమీటర్ల వేగంతో గుంటూరు హైవేపై దూసుకెళ్తూ ఉన్నదని ఆయనతో ప్రయాణించిన మరో ఇద్దరు వ్యక్తులు చెబుతున్నారు.