శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (10:51 IST)

నంద్యాల బైపోల్ ప్రచారానికి తెర : దొరికిన డబ్బు రూ.కోటిన్నర, పంచింది రూ.60 కోట్లు!

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిలు తలపడుతున్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అ

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిలు తలపడుతున్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, ఈ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ చేశారట. ఈ ఎన్నికల బందోబస్తులో భాగంగా పోలీసులు జరిపిన తనిఖీల్లో దాదాపు కోటిన్నర రూపాయలు పట్టుబడగా, సుమారు 60 కోట్ల రూపాయలు ప్రజలకు అందినట్టు సమాచారం. 
 
ఓ పార్టీ ఓటుకు రూ.2 వేలు పంచగా, మరో పార్టీ రూ.1000 ఇచ్చినట్టు ప్రజలు చెప్పుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ గ్రామంలో తొలుత ఓ ప్రధాన పార్టీ రూ.1000 చొప్పున పంచగా, అదేరోజు సాయంత్రం మరో పార్టీ వచ్చి ఓటుకు రూ.2 వేల చొప్పున పంపకాలు ప్రారంభించగా, తొలుత వెయ్యి రూపాయలు ఇచ్చిన పార్టీ నేతలు మరోమారు వచ్చి మరో వెయ్యి చొప్పున ఇచ్చి వెళ్లినట్టు స్థానికుల సమాచారం. రెండు పార్టీలూ వేసిన ఎత్తుకు పైఎత్తులు ఎలా ఉన్నా, చివరకు పంపకాల్లో ఒక పార్టీ ముందడుగు వేసినట్టు ప్రచారం జరుగుతూ ఉంది.
 
వాస్తవానికి అధికార పార్టీ ఉప ఎన్నికల ప్రచారాన్ని తొలుత అభివృద్ధి మంత్రంతోనే ప్రారంభించింది. అయితే, ఇలా ముందుకుపోతే గెలుపు అసాధ్యమని టీడీపీ శ్రేణులు చెప్పడంతో డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టినట్టు సమాచారం. అలాగే, విపక్ష పార్టీ కూడా ఇదే పంథాను అనుసరించినట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.5 వేల వరకూ ధర పలుకగా, పలు చోట్ల తమకు డబ్బు అందలేదన్న నిరసనలు, ఆందోళనలు చేయడం డబ్బు పంపిణీకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. మొత్తంమీద నంద్యాల ఉప ఎన్నికలో డబ్బు, మద్యం ఏరులై పారిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఎన్నో రకాలుగా బందోబస్తు చర్యలు చేపట్టినప్పటికీ.. ఈ డబ్బు, మద్యం ప్రవాహానికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయింది.