గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 22 ఏప్రియల్ 2017 (08:32 IST)

ఉన్న తలనొప్పులకు తోడు ఈ నంద్యాల తలనొప్పేమిటి? తల పట్టుకుంటున్న బాబు

దివంగత నేత భూమానాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియకు చిన్నవయసులోనే మంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా భూమానాగిరెడ్డి మృతికి పరోక్ష కారకుడన్న ఆరోపణలనుంచి తప్పించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మళ్లీ నంద్యాల తలపోటు తప్పేటట్టు లేదు.

దివంగత నేత భూమానాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియకు చిన్నవయసులోనే మంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా భూమానాగిరెడ్డి మృతికి పరోక్ష కారకుడన్న ఆరోపణలనుంచి తప్పించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మళ్లీ నంద్యాల తలపోటు తప్పేటట్టు లేదు.  భూమా నాగిరెడ్డి మృతి ద్వారా నంద్యాల సీటుకు ఉప ఎన్నిక జరపడం తప్పనిసరైన స్థితిలో చంద్రబాబుకు కనీసం ముందస్తుగా కూడా మాట చెప్పకుండా.. నంద్యాల మాదే, మా కుటుంబానిదే అంటూ డేరింగ్ ప్రకటన చేశారు అఖిలప్రియ. 
 
అఖిల ప్రియ వాదనకు ఒక హేతువు ఉంది. ఏ నాయకుడైనా ఆకస్మికంగా, అర్ధాంతరంగా చనిపోయినట్లయితే ఖాళీ అయిన ఆ స్తానాన్ని ఆ కుటుంబానికే కట్టబెట్టాలనే సంప్రదాయం ఉంది. ఈ ప్రాతిపదికనే అఖిలప్రియ నంద్యాల శాసనసభా స్థానాన్ని తన కుటుంబంలోనే ఒకరికి ఇవ్వాలని గట్టిగా కోరింది. కానీ గతంలో వైకాపా తరపున నంద్యాల నుంచే పోటీ చేసి తనను ఓడించిన భూమా నాగిరెడ్డి కుటుంబం అంటే బద్ద వ్యతిరేకత చూపించే శిల్పా మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం నంద్యాల సీటు తనదే అని మొండిపట్టు పట్టారు. వైకాపా నుంచి భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడాన్నే తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి శిల్పా. 
 
అలాంటి శిల్పాకి ఇప్పుడు నంద్యాల సీటు ఇవ్వకపోతే ఉన్నపళానా శిల్పా మోహన్ రెడ్డి వైకాపాలో చేరిపోయే అవకాశముంది. మరోవైపున సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి మహమ్మద్ ఫరూక్ కూడా నంద్యాలకు చెందిన వారే. పైగా చరిత్రలో మొదటిసారిగా టీడీపీ ప్రభుత్వం మైనారిటీలకు కేబినెట్లో స్థానం కల్పించలేదు.
 
అఖిల, శిల్పా, ఫరూఖ్ ఈ ముగ్గురిలో ఎవరికి నంద్యాల సీటు కల్పించినా మిగతా ఇద్దరితో పోటీ చేసే అభ్యర్థికి చిక్కులు తప్పవు. అందులోనూ ఏ ప్రత్యక్ష ఎన్నికలోనూ ప్రస్తుతం వైకాపా ముందు తలవంచడం అంటే టీడీపీ ప్రతిష్టకు భంగకరమే అవుతుంది. 
 
అందుకే ఉన్న సమస్యలు చాలవని ఈ నంద్యాల కూడా ఇప్పుడే తగులుకోవాలా అనేది బాబు డైలమ్మా.