శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (10:14 IST)

ఏం.. రాయలసీమకు వెళితే చంపేస్తారా...? నాలో సీమ పౌరుషముంది :: నారా భువనేశ్వరి ప్రశ్న

bhuvaneswari
రాయలసీమ పర్యటనకు వెళ్లొద్దని తనకు చాలా మంది చెప్పారని, ఏం.. అక్కడకు వెళితే చంపేస్తారా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. మీరంత అండగా ఉండగా తనకు ఏం భయం.. ఎవరు చంపుతారని ప్రశ్నించారు. రాయలసీమలోనే ఎక్కువ ఏళ్లు గడిపిన తనలో కూడా సీమ పౌరుషం ఎక్కువేనని చెప్పారు. 
 
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో తన భర్త, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు నిజం గెలవాలి పేరిట ఉమ్మడి కడప జిల్లాలో బుధవారం ఆమె యాత్ర చేపట్టారు. రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం ఎగువ గొట్టివీడులో రెడ్డమ్మ కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. రాయచోటిలో రవీంద్రరాజు కుటుంబాన్ని పరామర్శించి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. 
 
అక్కడకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలనుద్దేశించి భువనేశ్వరి ఉద్వేగంగా మాట్లాడారు. రాయలసీమ వెళ్లొద్దని చాలామంది తనకు చెప్పారని.. మీరంతా అండగా ఉన్నప్పుడు తానెందుకు భయపడతానని ప్రశ్నించారు. ఐదేళ్ల వైకాపా అరాచక పాలనకు స్వస్తి పలకాలన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధించాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాయచోటికి చేరుకున్న భువనేశ్వరికి తెదేపా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, రాయచోటి నియోజకవర్గ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్వాగతం పలికారు. మరో రెండు రోజుల పాటు ఆమె ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు.