ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

చవితి రోజున రాజమండ్రిలోనే చంద్రబాబు కుటుంబం

nara bhuvaneswari
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రిలోనే బస చేస్తున్నారు. పండుగ పూట కూడా వారంతా అక్కడే ఉంటున్నారు. దాదాపు వారం రోజులుగా బాబు కుటుంబ సభ్యులు ఇక్కడే ఉంటున్నారు. 
 
మరోవైపు, తన తండ్రి అరెస్టు అక్రమంటూ జాతీయ స్థాయిలో చెప్పేందుకు ఢిల్లీ వెళ్లిన నారా లోకేశ్.. గత మూడు రోజులుగా అక్కడే ఉన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న లోకేశ్‌ దంపతుల కుమారుడు దేవాన్ష్‌ బెంగ పెట్టుకోవడంతో బాలకృష్ణ సతీమణి వసుంధర ఆ చిన్నారిని ఆదివారం రాజమండ్రికి తీసుకొచ్చారు. 
 
ఇదిలావుంటే, రాజమండ్రిలో తాత్కాలిక క్యాంపులో ఉంటున్న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, నందమూరి వసుంధరలను పలువురు నాయకులు కలిశారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ నాయకులు నన్నపనేని రాజకుమారి, ఆదిరెడ్డి అప్పారావు, జ్యోతుల నవీన్‌, తెలుగు మహిళా నాయకురాలు సత్యవాణి తదితరులు వచ్చి వారితో మాట్లాడి వెళ్లారు. 
 
'రాష్ట్రంలో రాజధాని నిర్మించాలన్నా, రహదారులు బాగుపడాలన్నా, శాంతిభద్రతలు కాపాడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా చంద్రబాబు వంటి పరిపాలనాదక్షుడు రాష్ట్రానికి అవసరమని' తెదేపా సీనియర్‌నేత నన్నపనేని రాజకుమారి అన్నారు. చంద్రబాబుకు నష్టం జరిగితే కేవలం ఆ కుటుంబానికే కాదని.. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నష్టపోతుందని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని ఆమె అన్నారు.