ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2023 (13:44 IST)

జగన్.. ఓ హార్డ్‌‍కోర్ క్రిమినల్... టీడీపీ - జనసేన కలిసి పోటీచేస్తాం : పవన్ కళ్యాణ్

pawan kalyan
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు లోకేశ్, బాలకృష్ణలు గురువారం ములాఖత్ నిర్వహించారు. ఆ తర్వాత వారు జైలు బయట మీడియాతో మాట్లాడుతూ, జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్ ఒక హార్డ్‌ కోర్ క్రిమినల్ అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అయితే, తమతో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామని, వస్తారో రారో ఒక వారి ఇష్టమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 
 
చంద్రబాబుతో దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమైన పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడుతూ, 'గత నాలుగున్నర సంవత్సరాలుగా ఏపీలో అరాచక పాలనను చూస్తున్నాం. అరాచక పాలనలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి, చట్ట వ్యతిరేకంగా రిమాండ్‌కు పంపించారు. ఆయనకు సంఘీభావం ప్రకటించడానికి ఇక్కడకు వచ్చాను, చంద్రబాబుపై గతంలో కూడా పాలసీ పరంగానే విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. మేము విడిగా కూడా పోటీ చేశాం. రాష్ట్రం బాగుండాలి, దేశ సమగ్రత బాగుండాలి అని నేను కోరుకుంటాను.
 
రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీకి రాజధాని కూడా లేదు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి న్యాయం చేయలేకపోయింది. ఆ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు కొందమందికి ఇబ్బందిగా దక్షిణ భారతంలో నేను మోడీకి మద్దతు తెలిపాను. ముంబైలో ఉగ్రదాడి జరిగినప్పుడు దేశానికి బలమైన నాయకుడు కావాలని కోరుకున్నాను. అందుకే 2014లో మోడీ వచ్చిన తర్వాత ఆయనకు మద్దతు తెలిపాను. మోడీ పిలిచినప్పుడే నేను ఢిల్లీకి వెళ్లానే కానీ, నా అంతట నేను ఎప్పుడూ వెళ్లలేదు.
 
విడిపోయిన ఏపీకి సమర్థవంతమైన నాయకుడు కావాలని నేను కోరుకున్నా. అందుకే చంద్రబాబుకు మద్దతు పలికాను. చంద్రబాబుతో పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు. కానీ ఆయన అపారమైన అనుభవం రాష్ట్రానికి కావాలి. స్కిల్ డెవలప్‌మెంట్‌లో తప్పులు జరిగితే దాని బాధ్యులైన అధికారులను శిక్షించాలి. సైబరాబాద్ వంటి అద్భుతమైన సిటీని నిర్మించిన వ్యక్తిని రూ.311 కోట్ల స్కామ్ అంటూ హింసిస్తున్నారు.
 
ఒక హార్డ్ కోర్ నేరస్తుడు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి చంద్రబాబును జైల్లో పెట్టించడం బాధాకరం. ఈడీ కేసులు ఉన్న వ్యక్తి, రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు చేసే వ్యక్తి, విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతులు తీసుకునే వ్యక్తి, అందరినీ భయభ్రాంతులకు గురిచేసే వ్యక్తి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని 2020లోనే చెప్పాను. అప్పుడే వైసీపీ ప్రభుత్వం పద్దతిగా పాలన సాగించి ఉంటే ఇప్పుడు బాలకృష్ణ, నారా లోకేశ్ మధ్య నిల్చొని మాట్లాడే పరిస్థితి నాకు వచ్చేది కాదు" అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.