బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (12:29 IST)

ఆ కంటెయినర్‌లో బ్రెజిల్ సరుకా.. లిక్కర్‌లో మెక్కిన రూ.వేల కోట్లా?

nara lokesh
అయ్యా ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులూ.. రోజు నా కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారు. ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా మీకు కనిపించిందా? మీ ఎదురుగా సీఎం ఇంటిలోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన ఈ కంటైనర్ తనిఖీ ఎందుకు చేయలేదు? అందులో ఏముంది?  బ్రెజిల్ సరుకా? లిక్కర్లో మెక్కిన వేల కోట్లా? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా? ఏపీ సెక్రటేరియట్ ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా? సమాధానం డిజిపి చెబుతారా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌లోకి మంగవారం ఓ కంటైనర్ లారీ వచ్చి వెళ్ళిన విషయం తెల్సిందే. దీనిపై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
సీఎం జగన్ నివాసంలోకి వచ్చిన కంటైనర్‌లో ఏముంది?
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌లోకి ఓ కంటెయినర్ వాహనం వచ్చి వెళ్లింది. అదీ కూడా రాంగ్ రూట్‌లో వచ్చిన వెళ్లడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఏపీ16 జడ్ 0363 నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీస్ స్టిక్కర్ ఉంది. సాధారణంగా జడ్ సిరీస్ కేవలం ఆర్టీసీ బస్సులకు, పి సిరీస్ పోలీస్ వాహనాలకు మాత్రమే వాడుతారు. కానీ, ఇక్కడు కంటెయినర్‌ వాహనానికి ఈ సిరీస్ వాడటం ఇపుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. 
 
సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చే దారిలో ప్రధాన రహదారి వద్ద మెయిన్ గేట్ ఉంటుంది. అక్కడ వాహనం, అందులో ఉన్నవారి వివరాలను నమోదు చేసుకుని అనుమతిస్తారు. అదేసమయంలో ఆ వాహనం వివరాలను వైర్లెస్ ద్వారా ముందున్న చెక్‌పోస్టు సిబ్బందికి చెబుతారు. మెయిన్ గేటు నుంచి నుంచి డివైడర్‌కు ఎడమ వైపున ఈ వాహనాలు లోనికి వస్తాయి. మధ్యలో రెండో చెకో పోస్టు వద్ద ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది. ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నంబరు, అందులో వచ్చిన వారి వివరాలను సరి చూసుకుంటారు.
 
ముందుగా అనుమతి ఉన్న సమాచారం ఉన్న వాహనాలనైతే ఆ స్కానర్ మీదుగా లోపలికి పంపుతారు. మంగళవారం వచ్చిన కంటెయినర్ ప్రధాన గేటు వద్ద ఎడమ వైపు రహదారిలో వచ్చినా, రెండో చెక్‌పోస్టుకు కాస్త ముందుగానే ఎడమ వైపు కాకుండా కుడి వైపు దారిలో మళ్లించి రాంగ్ రూట్లోనే క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. అందువల్ల రెండో చెకోపోస్టు వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు. 
 
ఈ రెండో చెక్ పోస్టు ముందు నుంచి కాకుండా వెనుక వైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటెయినర్ భాగాన్ని లోపలి వైపు ఉంచారు. సుమారు గంట తర్వాత ఆ వాహనం వచ్చిన దారిలోనే వేగంగా బయటకు వెళ్లిపోయింది. ఈ కంటెయినర్ ఎందుకు వచ్చింది ? అన్ని వాహనాల్లా ఎడమ వైపు నుంచి కాకుండా వ్యతిరేక మార్గంలో వెళ్లడం, అలా వెళుతున్నా భద్రతా సిబ్బంది వాహనాన్ని ఆపకపోవడం ఇవన్నీ సందేహాలకు దారి తీస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులు బయటకు పంపించారా? లేక బయట నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు డబ్బు కట్టలు వచ్చాయా అన్నది ఇపుడు సందేహంగా మారింది.