సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (14:09 IST)

డోర్ డెలివరీ మాయలోడు వైఎస్. జగన్ : నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్. జగన్మోహన్ రెడ్డిని డోర్ డెలివరీ మాయలోడు అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
రేష‌న్ బియ్యం, స‌రుకులు ఇచ్చే చౌక‌ధ‌ర‌ల దుకాణం వ‌ద్ద ప్ర‌జ‌లు క్యూ‌ల్లో నిల‌బ‌డి ఇబ్బందులు ప‌డ‌కుండా చేసేందుకు, స‌రుకుల కోసం దూర ప్రాంతానికి వెళ్లే ఇబ్బందులు తొల‌గించ‌డానికి ఏపీ సర్కారు రేషన్ డోర్ డెలివ‌రీని ప్రారంభించింది. అయితే, వాటి వ‌ల్ల ప్ర‌జ‌లు మ‌రిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ లోకేశ్ ఓ వీడియో పోస్ట్ చేశారు.
 
"పబ్లిసిటీకి, రియాలిటీకి మధ్య తేడా ఇదే. సన్న బియ్యం అన్న సన్నాసులు దొడ్డు బియ్యానికే పాలిష్ కొట్టి నాణ్యమైన బియ్యమంటూ మాయ చేశారు. ఇప్పుడు ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ అంటూ జనాల్ని వ్యాన్ల డోర్ల ఎదుట క్యూలైన్లలో నిలబెట్టి హింసిస్తున్నారు" అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 
 
అంతేకాకుండా, మరో ట్వీట్‌లో 'డోర్ డెలివరీ మాయలోడు వైఎస్.జ‌గ‌న్ కనపడితే సన్న గడ్డి పెట్టడానికి అక్క చెల్లెమ్మలు క్యూలో రెడీగా ఉన్నారు' అని నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.