శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (16:04 IST)

ఇంట్లో వాళ్ళకే జగన్ వెన్నుపోటు... అందుకే ఏ2 లేకుండానే షర్మిల పార్టీ? బాబు సెటైర్లు

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్. జగన్మోహన్ రెడ్డి కేవలం రాష్ట్ర ప్రజానీకానికే కాకుండా ఇంట్లోనివారికి కూడా వెన్నుపోటు పొడిచారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అందుకే ఏ2 లేకుండానే జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీ పెట్టనున్నట్టు తెలుస్తోందన్నారు. 
 
తెలంగాణాలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై చంద్రబాబు బుధవారం స్పందించారు. పార్టీ పెడుతున్నానని షర్మిల చెబుతుంటే.. ఏ2 మాత్రం లేదంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో ప్లే చేశారు.
 
ఆనాడు జగనన్న వదిలిన బాణం విశ్వసనీయత ఏమైందన్నారు. విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్.. షర్మిల పార్టీ పెట్టడంపై స్పందించాలన్నారు. ఇంట్లో వాళ్ళకే జగన్ వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. బాబాయ్ హత్య ఇంకా తేల్చ లేదని విమర్శించారు. 
 
అప్పుడు సీబీఐ కావాలని డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడు వద్దు అంటున్నారన్నారు. బాబాయ్‌ని చంపిన వారితో కలిసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. నాడు వివేకా కూతురు... నేడు షర్మిల పోరాడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇకపోతే, పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలపై కూడా ఆయన స్పందించారు. 
 
క్షేత్ర స్థాయిలో ఇంకా టీడీపీ ఎంతో బలంగా ఉందనే విషయాన్ని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా, టీడీపీ మద్దతు తెలిపిన అభ్యర్థులు 1023 పంచాయతీల్లో విజయం సాధించారని, వారి ఓట్ల శాతం 38 శాతంగా ఉందని బాబు గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపాను ఓడించడం టీడీపీ శ్రీకారం చుట్టిందన్నారు.