త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ దంపతులు ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానమాచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు.
ఆ తర్వాత అక్కడ నుంచి వారణాసికి చేరుకున్నారు. అక్కడ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కాశీ విశాలాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం వారణాసి నుంచి బయలుదేరి విజయవాడ నగరానికి చేరుకుంటారు.
కాగా, ఈ నెల 26వ తేదీ వరకు మహాకుంభమేళా వేడుక జరుగనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే 52 కోట్ల మందికిపై భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విదేశాల నుంచి సైతం భక్తులు ఈ మహాకుంభమేళాకు తరలివస్తున్నారు. శత్రుదేశమైన పాకిస్థాన్ నుంచి హిందూ భక్తులు తరలిరావడం విశేషం.