గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 6 మే 2022 (23:20 IST)

విద్యా వ్యవస్ధలో నాణ్యత, పరిశోధనలపై జాతీయ విద్యావిధానం ప్రత్యేక దృష్టి: గవర్నర్ బిశ్వభూషణ్

Governor
అసమానతలు లేని సమాజం, మానవ నైపుణ్యతల పెంపే లక్ష్యంగా జాతీయ విద్యా విధానం-2020 స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. జాతీయ భావ ప్రేరేపణ, సార్వత్రిక సౌలభ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా న్యాయబద్దమైన సమాజాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల 3వ సదస్సు రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో జరిగింది.

 
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల కులపతి హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తూ నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ అందించేలా విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయడానికి కట్టుబడి ఉందని, ఉన్నత విద్యా రంగంలో అనేక సంస్కరణలను ప్రారంభించిందని గవర్నర్ అన్నారు. ఉన్నత విద్యా వ్యవస్థ సంస్థాగత స్వయం ప్రతిపత్తి వైపు పయనించవలసిన ఆవశ్యకతను జాతీయ విద్యావిధానం స్పష్టం చేస్తుందన్నారు.

 
ఈ క్రమంలో కొన్ని కీలక మార్పుల అవశ్యకత ఉందని,  పాఠ్యాంశాల పునరుద్ధరణ, బోధన, మూల్యాంకనం, విద్యార్థుల అనుసరణీయత, ఉత్తమ బోధకుల పాత్ర వంటి అంశాలు మిళితం అయి ఉన్నాయన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో జాతీయ విద్యావిధానం అమలు ఒక క్రమపద్ధతిలో జరుగుతోందని, ఇంజనీరింగ్, సాంప్రదాయ డిగ్రీ కోర్సుల పాఠ్యాంశాలను రీ-డిజైన్ చేయడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు.

 
విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో గుణాత్మక పరిశోధనలను ప్రోత్సహించడానికి, పరిశోధనా పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర పరిశోధనా మండలిని ఏర్పాటు చేయడం సరైన దిశలో తొలి అడుగు వంటిదన్నారు. దేశంలో నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, కోర్సులో భాగంగా ఒక సంవత్సరం పరిశోధనకు కేటాయిస్తున్నారని గవర్నర్ శ్రీ హరిచందన్ అన్నారు. ఉపకులపతులు అధిక నాణ్యతతో కూడిన పరిశోధన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వ్యూహాలను రూపొందించాలని ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేసేలా విద్యావ్యవస్ధ రూపుదిద్దుకోవాలన్నారు.

 
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ వ్యవసాయ విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధన్యతను ఇస్తుందని, నిరుద్యోగ యువత ఆధునిక వ్యవసాయం వైపు ఆకర్షితులయ్యేలా కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీకి అనుగుణంగా ఉన్నత విద్యావ్యవస్ధను తీర్చి దిద్దుతున్నామన్నారు.


ఉన్నత విద్య విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. సదస్సుకు హాజరైన ఇరవై మూడు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు తమ సంస్ధల పురోగతిపై నివేదికను సమర్పించి, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను కులపతి హోదాలోని గవర్నర్ కు  వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు అచార్య కె. హేమచంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు అచార్య కె. రామమోహనరావు, కార్యదర్శి అచార్య బి. సుధీర్ ప్రేమ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.