శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:00 IST)

అనంతపురంజిల్లాకు పిడుగులాంటి వార్త

అనంతపురంజిల్లాకు పిడుగులాంటి సమాచారం. స్థానిక దొంగలే ఇళ్లను గుల్ల చేస్తున్న తరుణంలో.. పేరుమోసిన అంతర్రాష్ట్ర దొంగలు వచ్చేస్తున్నారట. ఈ విషయాన్ని ఏకంగా పోలీసులే వెల్లడించటం, దొంగల ఫొటోలను కూడా విడుదల చేయటంతో ప్రజల్లో భయం రెట్టింపైంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం నగర పోలీసులు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లో చోరీలు, దోపిడీలకు పాల్పడిన ముఠాలు వచ్చినట్లు సమాచారం ఉందన్నారు. ఇటీవల గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో హర్యానా, ఢిల్లీ గ్యాంగ్‌లు పాల్పడిన చోరీలను పరిశీలిస్తే ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని వారు తెలియజేశారు.

ఈ గ్యాంగ్‌లకు సం బంధించి ఇద్దరు నిందితుల ఫొటోలను విడుదల చేశారు. నగరంలోని అపార్టుమెంట్లు, పెద్ద భవనాల యజమానాలు, లాడ్జిల నిర్వాహకులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భద్రతను మరింత పెంచుకోవాలని సూచించారు. రెండ్రోజుల క్రితం చిత్తూరులో చోరీకి పాల్పడ్డారని గుర్తు చేశారు.

అనుమానాస్పద వ్యక్తులు, పరిచయం లేని వారు వస్తే క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రధానంగా లాడ్జిలు, ఆపార్టుమెంట్లకు వచ్చే వారి వివరాలను సమగ్రంగా నమోదు చేసుకోవాలని సూచించారు.

పోలీసులు కూడా ఆ దిశగా నగరంతోపాటు శివారు ప్రాంతాలపై నిఘా పెంచినట్లు ఆ వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాలో వరస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ గ్యాంగ్‌లు రావొచ్చని పోలీసులు ప్రకటన జారీ చేయటం నగరంలో చర్చనీయాంశంగా మారింది.