బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (10:49 IST)

వాహనదారులకు శుభవార్త!.. ‘ఫాస్టాగ్’లో కనీస నిల్వ నిబంధన ఎత్తివేత

వాహనదారులకు కేంద్రం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో ‘ఫాస్టాగ్’ నిబంధన అమల్లోకి రానున్న నేపథ్యంలో వ్యాలెట్‌లో కనీస నిల్వ ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్టు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఫాస్టాగ్ ఖాతాలో కనీస నిల్వ ఉంటేనే టోల్ ప్లాజాల నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో అక్కడ అనవసర రద్దీ ఏర్పడుతోంది.
 
దీనిని నివారించే ఉద్దేశంతో కనీస నిల్వ నిబంధనను ఎత్తివేసింది. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఫాస్టాగ్‌లో కనీస మొత్తం లేకున్నా అనుమతిస్తారు. అయితే, ఆ మొత్తాన్ని ఫాస్టాగ్ సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకుంటారు.

వాహనదారులు ఆ తర్వాత చెల్లించే టోల్ ఫీజు విషయంలో దీనిని కూడా కలుపుతారు. కాగా, ప్రస్తుతం 80 శాతం వరకు టోల్ చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ నెల 15 నాటికి దీనిని వంద శాతానికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.