శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (12:41 IST)

సీఎం అభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలు వాయిదా వేశా... టార్గెట్ చేశారు : నిమ్మగడ్డ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అభీష్టానికి వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడమే తాను చేసిన తప్పు అని ఏపీ మాజీ ష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. తనను అడ్డదారిన తెచ్చిన ఆర్డినెన్స్ ద్వారా పదవీచ్యుతుడిని చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన రాష్ట్ర హైకోర్టులో ఒక అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. 
 
తాను నిష్పక్షపాతంగా పని చేస్తుంటే, ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని, వైసీపీ నేతలపై ఫిర్యాదులు రాగా, తాను నివేదికలు కోరడమే తప్పైందని వాపోయారు. తాను స్థానిక ఎన్నికలను వాయిదా వేయకుంటే, ఏపీ ఈపాటికి కరోనా హాట్‌స్పాట్‌గా మారి ఉండేదని, అయితే, ఎన్నికలు వాయిదా వేయాలని తాను తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి, తనకు మధ్య ఘర్షణ జరిగిందన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని, సర్వీస్ నిబంధనలను మారుస్తూ జారీ చేసిన జీవోలను నిలుపుదల చేయాలని ఆయన తన అత్యవసర పిటిషన్‌లో కోరారు. ముఖ్యంగా, అత్యవసర సమయాల్లో మాత్రమే ఆర్డినెన్స్‌లను తేవాలని, అది కూడా న్యాయ సమీక్షకు లోబడివుండాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, ఏపీలో అలాంటి పరిస్థితి లేకున్నా, తనను తప్పించాలన్న ఉద్దేశంతోనే జీవో తెచ్చారని ఆయన ఆరోపించారు. 
 
ఆర్డినెన్స్‌ల జారీలో అధికార దుర్వినియోగం జరిగిందని భావిస్తే, కోర్టులు జోక్యం చేసుకోవచ్చని తన పిటిషన్‌లో గుర్తు చేసిన నిమ్మగడ్డ, సీఎం అభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలను వాయిదా వేయడం తన తప్పయిపోందన్నారు. రాష్ట్రాల పరిధిలో ఎన్నికల కమిషనర్ తొలగింపునకు రాజ్యాంగంలోని నిర్దేశిత విధానాన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని ఆరోపించారు.
 
ఇదిలావుంటే, ఎస్ఈసీ పదవీ కాలాన్ని తగ్గిస్తూ, ఆర్డినెన్స్ తేవడం, ఆ వెంటనే నిమ్మగడ్డను తొలగించి, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజును ఆ పదవిలో నియమించడాన్ని సవాల్ చేస్తూ, ప్రకాశం జిల్లా న్యాయవాది తాండవ యోగేశ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, వాటినన్నింటిపై సోమవారం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి.