శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 29 జులై 2021 (22:45 IST)

పుష్ప‌గుచ్చాలు వ‌ద్దు, పుస్త‌కాలు ఇవ్వండి...కొత్త క‌లెక్ట‌ర్

కొత్త‌గా క‌లెక్ట‌ర్ వ‌స్తున్నారంటే... అంద‌రూ వారిని అభినందించ‌డానికి పూల దండ‌లు, పుష్ప‌గుఛ్చాలు ప‌ట్టుకుని బారులు తీర‌తారు. కానీ, ఈ కొత్త క‌లెక్ట‌ర్ అవేమీ వ‌ద్ద‌ని ముందే చెప్పేస్తున్నారు. తాను వ‌స్తున్నా...అని ఎవ‌రూ పూల దండ‌లు, పుష్ప‌గుఛ్చాలు తేవ‌ద్ద‌ని చెప్పేశారు. అనాధ పిల్ల‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా... నోటు పుస్త‌కాలు, పెన్నులూ ఇవ్వండ‌ని సూచించారు.
 
విజయనగరం జిల్లా కలెక్టర్ గా నియమితులైన సూర్యకుమారి ఈనెల 30న బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అధికారులు, అనధికారులు, ఇతరులు ఇకపై తనకు పూల దండలు,పుష్ప గుచ్ఛాలు తేవద్దని కోరారు.

వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగ పడేలా నోటు పుస్తకాలు ఇవ్వాలని సూచించారు. పుష్పగుచ్చాల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని విద్యార్థులకు ఉపయోగపడే పనికి వినియోగించడం వల్ల ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసినట్లవుతుందని, అందరూ ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.