మా పార్టీ మేనిఫెస్టోలో అభివృద్ధికి మాత్రమే చోటు - ఉచితాలకు కాదు : లక్ష్మీనారాయణ
తమ పార్టీలో ఉచిత హామీలకు చోటు లేవని, కేవలం అభివృద్ధికి మాత్రమే చోటు ఉంటుందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) సీబీఐ మాజీ అధికారి వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన ఇటీవల కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ పార్టీ తరపున వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం మేనిఫెస్టో ముసాయిదాను తయారు చేస్తున్నారు. ఇందుకోసం సలహాలు, సూచనలు కావాలని ఆయన ట్విట్టర్ వేదికగా కోరారు. తమ మేనిఫెస్టోలో అభివృద్ధి మాత్రమే ఉంటుందని, ఉచితాలకు అందులో చోటు ఉండదని స్పష్టం చేశారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడతూ, ఎన్నికలు వస్తున్నాయంటే ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపిస్తుంటాయన్నారు. ఈ క్రమంలో సాధ్యాసాధ్యాలను సైతం మర్చిపోతుంటారని ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరుతో ఎడాపెడా హామీలు గుప్పించడం షరా మామూలుగా మారిందన్నారు. ఈ క్రమలో అభివృద్ధిని అటకెక్కించేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా అది ఇస్తాం. ఇది ఇస్తాం అని అంటున్నాయి తప్ప అది చేస్తాం. ఇది చేస్తాం అని చెప్పే పార్టీలు దాదాపు కనుమరుగైపోయాయి అని తెలిపారు.