గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (09:46 IST)

మేనల్లుడి నిశ్చితార్థం కోసం హైదరాబాద్ వెళుతున్న సీఎం జగన్

Jagan_Sharmila
తన మేనల్లుడు, వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం కోసం వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లి ప్యాలెస్ నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్నారు. హైదరాబాద్ నగరంలోని గోల్కొండ రిసార్ట్స్‌లో ఈ వేడుక జరుగనుంది. ఈ వేడుక పూర్తయిన తర్వాత ఆయన రాత్రికే అమరావతికి చేరుకుంటారు. 
 
కాగా, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జనవరి 18వ తేదీన హైదరాబాద్ నగరంలో జరుగనుంది. ఈ వేడుకకు హాజరుకావాలంటూ తన అన్న, ఏపీ సీఎం జగన్‌తో పాటు అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులను షర్మిల స్వయంగా ఆహ్వానించారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమం గురువారం రాత్రి జరుగుతుంది. 
 
ఇందులో పాల్గొనేందుకు సీఎం జగన్ గురువారం సాయంత్రం 6.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతారు. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు గంమడిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌కు వెళ్ళి తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొంటారు. రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి చేరుకుంటారు. 19వ తేదీన విజయవాడలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తారు.