శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (12:19 IST)

తిరుమలలో లైసెన్స్ లేని స్కూళ్ళు.. ఎన్నెన్నో.. మొద్దు నిద్రలో విద్యాశాఖ!

భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలలు అడ్డదిడ్డంగా వెలుస్తున్నాయి. కనీస వసతులు లేకుండా తరగతులకు తగిన టీచర్లు లేకున్నా టెక్నోలు, ఇ టెక్నోలు అని పేర్లు పెట్టి కోట్లు దండుకుంటున్నారు. పాఠశాలలు పెట్

భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలలు అడ్డదిడ్డంగా వెలుస్తున్నాయి. కనీస వసతులు లేకుండా తరగతులకు తగిన టీచర్లు లేకున్నా టెక్నోలు, ఇ టెక్నోలు అని పేర్లు పెట్టి కోట్లు దండుకుంటున్నారు. పాఠశాలలు పెట్టాలంటే విద్యాశాఖ నుంచి పక్కాగా అనుమతులు ఉండాలి. కానీ అలాంటి అనుమతులు లేని పాఠశాలలు తిరుపతిలోనే పదుల సంఖ్యలో ఉండాలంటే మన విద్యాశాఖ మొద్దునిద్ర ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. 
 
తిరుపతి ఆధ్మాత్మిక నగరమే కాకుండా విద్యానగరంగా విరాజిల్లుతోంది. ఆరు యూనివర్సిటీలు తిరుపతిలో నెలకొని ఉన్నాయి. దీంతో ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు విద్యను అభ్యసించడానికి తిరుపతికి వస్తారు. స్కూలు ఎడ్యుకేషన్‌ కూడా అదే రేంజ్‌లో అభివృద్ది చెందింది తిరుపతిలో. 5వ తరగతి నుంచే తిరుపతిలోని ప్రముఖ పాఠశాలల్లో విద్య నేర్పించాలని రాయలసీమ జిల్లాల్లోని చాలామంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందులో భాగంగా తిరుపతిలోని పాఠశాలలకు బారీ డిమాండ్ ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది వ్యాపారస్తులు అనుమతులు కూడా లేకున్నా వీధికొక పాఠశాలలను ఏర్పాటు చేసి కార్పొరేట్ లెవల్లో కటింగ్ ఇస్తూ విద్యార్థుల నుంచి లక్షలు రాబడుతున్నారు. 
 
ఒక్క తిరుపతి నగరంలోనే 47 అనుమతిలేని పాఠశాలలు నడుస్తున్నాయంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పాఠశాలకు వెయ్యిమందిని పిల్లలను వేసుకున్నా 40 వేల మంది పిల్లలు విద్యాశాఖతో ఎలాంటి సంబంధం లేకుండానే చదువులు కొనసాగిస్తున్నారు. రేపటి రోజున ఇలాంటి పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసుకుని బయటకు వస్తే పర్మిషన్లు లేవంటూ ప్రభుత్వాలు ఆ విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోతే వారి చదివిన చదువంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కనీస ఇంకితజ్ఞానం కూడా లేకుండా విద్యను పక్కాగా వ్యాపారంగా మార్చి ధనదాహాన్ని తీర్చుకుంటున్నారు కొందరు పెద్దలు.
 
పర్మిషన్లు ఉన్న చాలా పాఠశాలల్లో కూడా సరైన వసతులు లేవు. తనిఖీలకు వచ్చినప్పుడు చూసీచూడనట్లు వ్యవహరించడానికి విద్యాశాఖకు యేటా ముడుపులు చెల్లించుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించే ముందు వాటికి అనుమతులు ఉన్నాయా? లేవా? అని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాత తమ పిల్లలను చేర్పించాలని విద్యారంగ నిపుణులు సూచన చేస్తున్నారు.