బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన మార్పు... పరదాలకు - ఆంక్షలకు స్వస్తి!!

Chandra babu Naidu
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయగా, గురువారం ఆయన అమరావతిలోని సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీలో మార్పు మొదలైంది. గత ప్రభుత్వంలో పాలకులు, పోలీసులు అమలు చేసిన అన్ని రకాల ఆంక్షలను పక్కనబెట్టేశారు. సీఎం వస్తున్నారంటే రోడ్డుకు ఇరువైపుల పరదాలు కట్టడం, చెట్లు నరికివేయడం, హెలికాఫ్టరులో వెళుతున్నప్పటికీ రోడ్లపై వాహనాలను గంటల కొద్ది నిలిపివేసి ప్రజలకు నరకం చూపించడం ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలకు ఫుల్‌స్టాఫ్ పెట్టాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. తద్వారా ఏపీలో మార్పుకు శ్రీకారం చుట్టారు. పరదాల పాలనకు సీఎం చంద్రబాబు తెరదించారు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు ఈ విషయం స్పష్టంచేశారు. 
 
అయితే... చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా పరదాలు కట్టడం కనిపించింది. దీనిపై మంత్రి లోకేశ్‌ అప్పుడే స్పందించారు. 'పరదాలు కట్టొద్దని చెప్పాం కదా' అని ప్రశ్నించగా... 'అలవాటులో పొరపాటు జరిగిందనే సమాధానం రావడంతో ఆయన సరదాగా నవ్వారు. ఇకపై పరదాలు, బారికేడ్లు వద్దని స్పష్టం చేశారు. ప్రజలకూ తమకూ మధ్య అడ్డంకులు వద్దని చంద్రబాబు కూడా అధికారులకు సూచించారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని, బెజవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. 
 
ఆ సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా వీలైనంత తక్కువ స్థాయిలో ఆంక్షలు అమలయ్యాయి. ఇక, జగన్‌ ముఖ్యమంత్రి హోదాలో సచివాలయం వైపు వెళ్లేందుకే ఇష్టపడలేదు. కేబినెట్‌ సమావేశాలు జరిగినప్పుడు మాత్రం వెళ్లేవారు. ఆ సమయంలో దారి పొడవునా వందలాది మంది పోలీసులను మోహరించేవారు. ఆ చిత్రం మారిపోయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానంతరం గురువారం తొలిసారి సచివాలయానికి వెళ్లిన చంద్రబాబుకు దారిపొడవునా ఘన స్వాగతం లభించింది. ప్రజలతో ఆయన మమేకమయ్యారు. రోడ్లపై టన్నుల కొద్దీ పూలచల్లి తమ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.