శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 జూన్ 2024 (17:51 IST)

ఏపీలో కొలువుల జాతర - 16 వేల టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు.. సంతకం చేసిన సీఎం చంద్రబాబు

babu sign
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 16 వేల పై చిలుకు పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమ్మతించారు. ఈ మేరకు సీఎంగా తొలి సంతకం కూడా చేశారు. బుధవారం ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. గురువారం సాయంత్రం 4.41 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలోని మొదటి బ్లాక్‌‍లో ఉన్న తన చాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.
 
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. ఈ పోస్టుల్లో కేటగిరిల వారీగా పరిశీలిస్తే, ఎస్‌జీటీ పోస్టులు 6,371, పీఈటీ పోస్టులు 132, స్కూల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు 7725, టీజీటీ పోస్టులు 1781, పీజీటీ పోస్టు 286, ప్రిన్సిపల్స్‌ పోస్టులు 52 చొప్పున ఉన్నాయి. 
 
ఆ తర్వాత గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు. దీంతో టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు.