ఏపీ మంత్రివర్గం.. పవన్‌కు హోం కాదు.. గ్రామీణాభివృద్ధి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మంత్రులుగా టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన మొత్తం 22 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ఇంకా శాఖలు కేటాయించాల్సివుంది. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు మంత్రులకు కేటాయించాల్సిన శాఖలు ఏంటన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి పవన్‌కు హోం శాఖ, నాందెండ్ల మనోహర్‌కు వైద్య ఆరోగ్య వంటీ కీలక శాఖలు కేటాయించినట్టు బుధవారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ, ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని, కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు ఇంకా కేటాయించలేదని గురువారం తేలిపోయింది. పైగా, కొత్త మంత్రులకు గురువారం శాఖలు కేటాయించవచ్చని తెలుస్తుంది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం తిరిగి వస్తారు. ఆ తర్వాత ఆయన శాఖలను కేటాయించనున్నారు. పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే, జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించనున్నట్టు తెలుస్తుంది. పవన్ కోరిక మేరకు గ్రామీణ నేపథ్యంలో ఉన్న శాఖను కేటాయించారని తెలుస్తుంది. లోకేశ్‌కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.