ఆన్‌లైన్ అప్పు - ప్రాణానికి ముప్పు : వివాహిత ఆత్మహత్య
ప్రస్తుతం అనేక యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో లోన్ యాప్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్స్ నిర్వాహకులు బయటకు చెప్పుకోలేని విధంగా మానసికంగా వేధిస్తున్నాయి. తాజాగా లోన్ యాప్ వేధింపులు భరించలేని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానికి చెందిన బండపల్లి ప్రత్యూష (24) అనే యువతికి ఇటీవలే వివాహమైంది. హాయిగా సాగుతున్న ఈ యువతి జీవితానికి శాపంలా మారింది.
ఒక లోన్ యాప్ ద్వారా కొంత రుణం తీసుకుంది. దీన్ని క్రమం తప్పకుండా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తూ వస్తుంది. మరో 8 వేల రూపాయలు మాత్రమే తిరిగి చెల్లించాల్సివుంది. ఈ క్రమంలో ఆమెకు లోన్ యాప్ నిర్వాహకుల నుంచి ఫోన్లలో వేధింపులు మొదలయ్యాయి. దీంతో మానసికంగా తీవ్ర మనోవేదనకు గురైన ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
లోన్ యాప్ నిర్వాహకుల బ్లాక్ మెయిలింగ్, వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన భర్త, తల్లిదండ్రులకు ఓ సెల్ఫీ వీడియోలో వెల్లడించింది. ఫోటోలను మార్ఫ్ చేసి బంధువులకు పంపుతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, అదే జరిగితే వారికి సమాధానాలు చెప్పలేనని పేర్కొంది. పైగా, లోన్ యాప్ వాళ్లు మార్ఫింగ్ చేసిన ఫోటోలు తనవి కాదని ఆమె బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది.