సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 3 జనవరి 2022 (12:46 IST)

మల్టీ విటమిన్ల వినియోగం ప్ర‌మాదం... ఆహారంతోనే ‘వ్యాధి నిరోధక శక్తి’

క‌రోనా వేరియంట్ల నేప‌థ్యంలో అంద‌రి దృష్టి వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెంపుపైనే ఉంది. దీనికోసం అప‌రిమితంగా మ‌ల్టీ విట‌మ‌న్ ట్యాబలెట్లు వాడేస్తున్నారు కొందరు... అది ఎంత‌వ‌ర‌కు మంచిదో మీకు తెలుసా?

 
కరోనా మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ముప్పు దేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న ప్రయాణికుల్లో కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 41 ఒమిక్రాన్‌ కేసులు  కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనా బారిన పడకుండా ఎవరికి వారు మాస్క్‌లు ధరించడం, చేతులను శానిటైజ్‌ చేసుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాల్సి ఉంది. ఈ తరుణంలో అందరిలో మరోసారి వ్యాధి నిరోధక శక్తిపై చర్చమొదలైంది. ఇమ్యూనిటీని పెంచుకోవడంలో మిటమిన్లు, మినరల్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వీటిని అవగాహనతో వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. లేదంటే పలు ఇబ్బందులు తప్పవు.  
 
 
కరోనా తర్వాత మల్టీ విటమిన్ల వినియోగం 5-10 శాతం నుంచి అమాంతంగా 30-40 శాతానికి పెరిగింది. విటమిన్లు మోతాదు మించితే రకరకాల శారీరక రుగ్మతలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు విటమిన్‌ సి (పెద్దలు రోజుకు 65-95 మిల్లీగ్రాములు మించి తీసుకోకూడదు. మోతాదు మించితే అతిసారం, వాంతులు, తలనొప్పి లాంటి సమస్యలు ఉంటాయి. విటమిన్‌ ఎ కొవ్వుల్లో కరుగుతుంది. ఇది మోతాదు కంటే ఎక్కువ వాడితే జుత్తు రాలిపోవడం, కాలేయం దెబ్బతినడం, ఎముకల్లో నొప్పి, దృష్టి లోపం, పొడి చర్మం లాంటి ఇబ్బందులు తప్పవు. జింకు పరిమితికి మించి వాడితే అజీర్ణం, అతిసారం, వాంతుల సమస్యలు వస్తాయి. చేతులు, కాళ్లు తిమ్మిర్లు పట్టి నాడి సమస్యలకు దారి తీస్తుంది. 
 
 
విటమిన్‌ డి రోజుకు 4వేల ఇంటర్నేషనల్‌ యూనిట్లు(ఐయూ) కంటే ఎక్కువ వాడితే వాంతులు, మలబద్ధకంతో పాటు కిడ్నీపై ప్రభావం పడుతుంది. విటమిన్‌ ఇ మోతాదు కంటే ఎక్కువ వాడితే రక్తం గడ్డకట్టే సామర్థ్యానికి ఆటంకం ఏర్పడుతుంది. బి6 ఎక్కువ తీసుకుంటే నరాల సమస్య, బి3 ఎక్కువ తీసుకుంటే వికారం, కాలేయం విడుదల చేసే ఎంజైమ్‌ స్థాయిలు పెరగడంలాంటి సమస్యలు వస్తాయి. వైద్యులు సూచనల మేరకు మాత్రమే విటమిన్‌ మాత్రలు, సిరప్‌లు వాడాలి.
 
 
వ్యాధి నిరోధక శక్తి ఒక్కరోజులో వచ్చేది కాదు. దీనిని మంచి ఆహారపు అలవాట్లతో కాపాడుకోవచ్చు. రోజూ తినే ఆహారంలో 30-40 శాతం పచ్చగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, ప్రోటీన్లు ఉండే మాంసాహారం, పప్పులు, ఒమేగా ఫ్యాట్లు లభ్యమయ్యే సీ ఫుడ్‌ తీసుకోవాలి. రక్తహీనత ఉన్నవారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. మనవద్ద 60 శాతం మంది మహిళలు, బాలికల్లో ఈ సమస్య ఉంది. ఇందుకు ఆకు కూరలు, కూరగాయలతో పాటు ఐరన్‌ మాత్రలు తీసుకోవాలి. మధుమేహం నియంత్రణలో లేనివారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామందికి ఆ వ్యాధి ఉన్నట్లు కూడా తెలియడం లేదు. 
 
 
మూడో వేవ్‌ రాకముందే పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం ఉంటే నియంత్రణలో పెట్టుకోవాలి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటినవారు, ఊబకాయం, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్‌ లాంటి జబ్బులు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ నిత్యం 30 నిమిషాలు, కనీసం వారంలో అయిదు రోజులు నడకలాంటి వ్యాయామం చేయాలి. రోజుకు 8 గంటల పాటు మంచిగా నిద్రపోవాలి. నిద్ర కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తమకు ఏదో అవుతుందనో ఆందోళన పడకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా కాపాడుకోవచ్చు.