48 గంటల్లోగా నేరచిట్టాను విప్పాలి.. పార్టీలకు సుప్రీం కోర్టు ఆదేశం
ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థులను ప్రకటించిన 48 గంటల్లోగా వారి నేరచిట్టాను పార్టీలు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ వ్యవస్థను నేర రహితంగా మార్చే దిశగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక అడుగులు వేసింది.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు హైకోర్టుల ఆమోదం లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించడం వీలుకాదని స్పష్టం చేసింది.
ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎంపికైన అభ్యర్థులు 48గంటల్లో తమ నేర చరిత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని లేకపోతే నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతించిన తేదీకి కనీసం రెండు వారాల ముందు ఈ వివరాలను బహిర్గతం చెయ్యాలని ఆదేశించింది.
పార్టీలు నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల్ని ఎందుకు ఎంచుకుంటున్నాయో కారణాలను కూడా వివరించాలని, కేసుల వివరాల్ని వెబ్‌సైట్‌లో పెట్టాలని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, అటువంటి అభ్యర్థుల వివరాలను కూడా దినపత్రికల్లో ప్రచురించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.