1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (12:13 IST)

లగ్జరీ జీవితాన్ని వదులుకుని మీ కోసం వస్తున్నాను : పవన్ కళ్యాణ్

pawan kalyan
తాను ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని ప్రజలు మేలు కోసం, మీరంతా బాగుండాలని కోరుకుంటా రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... కూటమిలో బలమైన నాయకత్వం ఉందన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు, మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి వంటి నేతలు కూటమిలో ఉన్నారని వివరించారు. 
 
ప్రధానంగా మీ కష్టాలను మోస్తున్న నేనున్నాను అని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడికి వెళ్లినా కూటమి ప్రభుత్వం వస్తుందని ప్రజలే చెబుతున్నారని వెల్లడించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. 'కిర్లంపూడిలో చెప్పాను... ఈ వైసీపీ ప్రభుత్వం అన్ని కులాలకు ద్రోహం చేస్తోంది. యువత భవిష్యత్తుతో నేను ఆటాడుకోను. ఈ ఐదేళ్లలో నేను సినిమాల ద్వారా దాదాపు రూ.200 కోట్లు సంపాదించాను. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలు చేశాను. సుమారు రూ.70 కోట్ల వరకు ట్యాక్స్ కట్టాను. నేనేమీ దాచిపెట్టేవాడ్ని కాను. నేను సుఖాలను వదులుకుని ఎందుకు వస్తున్నానంటే... మీ పక్కన అండగా నిలబడేవారు ఎవరు? చంద్రబాబు గారు జైల్లో ఉంటే ధైర్యంగా వెళ్లింది ఎవరు? ఆ ధైర్యం జనసేనకే ఉంది, పవన్ కల్యాణ్ కే ఉంది.
 
కష్టం వచ్చింది మన పార్టీకి వాడికి కాదులే, కష్టం వచ్చింది మన కులపు వాడికి కాదులే, మన బంధువుకు కాదులే అనుకుని మనం ఇంట్లో కూర్చుంటే లాభం లేదు. మానవ హక్కుల ఉల్లంఘన, రాజకీయ వేధింపులు ఎక్కడ ఉన్నా ఖండించాల్సిందే. అందుకే నేను చంద్రబాబు గారికి మద్దతు ప్రకటించాను" అంటూ పవన్ కల్యాణ్ వివరించారు.