శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మార్చి 2023 (19:17 IST)

కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తే సీఎం జగన్ ఇంటికే : పవన్ కళ్యాణ్

pawan kalyan
రాష్ట్రంలో కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం తథ్యమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఆదివారం తాడేపల్లిలో కాపు సంక్షేమ సేన ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
జనసేన ఇండిపెండెంట్ పార్టీ అని.. ఎవరి అజెండా కోసం పని చెయ్యదని స్పష్టం చేశారు. అంతేకాదు తాను ఎవ్వరికీ అమ్ముడు పోలేదని.. ప్రతికూల పవనాల్లో ఎదురైనా ధైర్యంగా పార్టీనీ నడుపుతున్నానని తెలిపారు. తాను కులం ప్రాతిపదికన మాట్లాడితే రెండు చోట్ల ఓడేవాడిని కాదని తెలిపారు. తనను ఓడించింది కాపు కులస్థులేనని, తాను ఓడిపోతే తొడలు కొట్టింది కూడా వారేనని చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తే ఇప్పుడున్న సీఎం జగన్ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమన్నారు. అసలు ఎన్నికల్లో డబ్బులు తీసుకుని ఓటు వేయడం సమాజానికి మంచిది కాదన్నారు. మీరు తళతళలాడే 2 వేల రూపాయల నోటు తీసుకోవాలంటే.. అక్కడ తీసుకుని జనసేనకు ఓటు వేయాలని కోరారు. 
 
తాను అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని.. ఎవరి బెదిరింపులకు తాను భయపడనన్నారు. వైసీపీ నాయకులు నన్ను చంపేస్తామని బెదిరించారని పవన్ చెప్పారు. మరణించిన తర్వాత రంగా గారి పేరు పెట్టండి అని అడుగుతున్నారు.. అసలు ఆయన బతికి ఉన్న సమయంలోనే జనం ఆయన వెంట ఉంటే.. అలా మరణించేవారు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా తాను నడుచుకోనని స్పష్టం చేశారు. ముఖ్యంగా, తెలుగుదేశం పార్టీ లేదా మరోపార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోబోనని ఆయన స్పష్టం చేశారు. పార్టీని నడిపేందుకు డబ్బు ముఖ్యంకాదన్నారు. భావనా బలం ముఖ్యమన్నారు. భిన్న భావనలు కలిగిన వ్యక్తులను ఒకతాటిపైకి తెచ్చి ముందుకు నడిపించడమే భావనా బలమన్నారు. 
 
ఇదిలావుంటే మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు (కొవ్వూరు), ఈదర హరిబాబు (ఒంగోలు)లు ఆదివారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారితో పాటు మరికొందరు నేతలు, కార్యకర్తలు కూడా జనసేన పార్టీలో చేరగా, వారందరికీ పవన్ కళ్యాణ్ జనసేన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.