సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (14:10 IST)

వకీల్ సాబ్ కాదు.. షకీలా సాబ్ : పవన్‌పై కొడాలి నాని సెటైర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. గుడివాడ జంక్షన్‌లో రంకెలు వేసింది వకీల్ సాబ్ కాదు... షకీలా సాబ్ అని అన్నారు. పవన్ కళ్యాణ్‌ సోమవారం గుడివాడలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఓ కూడలిలో ఆయన ప్రసంగిస్తూ, మంత్రి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 
 
శతకోటి లింగాల్లో బోడి లింగం అన్నట్టు... శతకోటి నానీల్లో ఒక నాని అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై కొడాలి నాని అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. శతకోటి లింగాల్లో పవన్ కల్యాణే ఒక బోడిలింగమని... తాను శివలింగం వంటివాడినని అన్నారు. పవన్ బోడిలింగం కాబట్టే... గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారన్నారు. 
 
పవన్ కల్యాణ్‌ను ప్యాకేజ్ స్టార్ అని కొడాలి నాని అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదవి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. పవన్‌లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టమన్నారు. వంద మంది పవన్ కల్యాణ్‌లు వచ్చినా జగన్‌ను ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు.
 
తన నియోజకవర్గంలో పేకాట క్లబ్బులను ఎక్కడా నిర్వహించడం లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్‌లను మూసేస్తున్నామే తప్ప... వాటిని ప్రోత్సహించడం లేదని అన్నారు. 
 
పవన్ కల్యాణ్ తనను తాను వకీల్ సాబ్ అనుకుంటున్నారని... కానీ జనాలు మాత్రం ఆయనను షకీలా సాబ్‌గా భావిస్తున్నారని చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై ఒక బాధ్యత గల మంత్రిగా సమాధానాలు చెప్పేందుకే తాను స్పందిస్తున్నానని మంత్రి కొడాలి నాని తెలిపారు.