శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (16:39 IST)

రెండు రాష్ట్రాల్లో జనసేన పోటీ... 60 శాతం టిక్కెట్లు యువతకే : పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలాగే, తమ పార్టీ తరపున 60 శాతం టిక్కెట్లను యువతకు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపార

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలాగే, తమ పార్టీ తరపున 60 శాతం టిక్కెట్లను యువతకు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. జనసేనకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయని, ఈ మూడేళ్లలో జనసేనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పవన్ వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ఒక వెబ్ పోర్టల్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ పోర్టల్‌లో ప్రతి ఒక్కరూ 2500 పదాలకు మించకుండా, రాష్ట్రాల్లోని కీలక సమస్యలపై సూటిగా తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు మొత్తం రాష్ట్రంలో 32 సమస్యలను గుర్తించామన్నారు. ప్రజల నుంచి, గృహిణుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించామన్నారు. ఇకపోతే 2019లో పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో యువతకే పెద్ద పీట వేస్తామన్నారు. 
 
అంతేకాకుండా, తాము ఎన్డీయేలో భాగస్వామిగా లేమన్నారు. అదేసమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలు, ప్రభుత్వ లక్ష్యాలు తనకు బాగా తెలుసన్నారు. కానీ, అవి ప్రజలకు చేరాల్సినంతగా చేరడం లేదని పవన్ కళ్యాణ్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా, కింది స్థాయిలో తమ పార్టీ సంస్థాగతంగా బలంగా లేదనీ, అలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోవడం సరికాదన్నారు. ఏదిఏమైనా ఎన్నికల సమయంలో ఈ విషయంపై ఓ స్పష్టత వస్తుందన్నారు.