శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (12:40 IST)

ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్

payyavula keshav
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో పయ్యావుల కేశవ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను కేటాయించిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఆయన గురువారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని తన చాంబర్‌లోకి ప్రవేశించి, వేద పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక మంత్రిగా తన తొలి సంతకాన్ని 15వ ఆర్థిక సంఘం నిధుల ఫైలుపై చేశారు. 
 
రూ.250 కోట్ల ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, జానకి, వినయ్ చంద్, రాష్ట్ర పన్నుల విభాగం ముఖ్య కమిషనర్ గిరిజా శంకర్, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ కె.ఆదినారాయణ, ట్రెజరీస్ డైరెక్టర్ మోహన్ రావుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 
మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తన ప్రధాన బాధ్యత అని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా 16 పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆపేసిందని... ఆ పథకాలన్నీ 60 శాతం రాష్ట్రం, 40 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టేవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా వాడుకోలేని దారుణ స్థితి వైసీపీ హయాంలో ఉందని విమర్శించారు.