సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జూన్ 2024 (14:32 IST)

పయ్యావుల కేశవ్ మంత్రి అయ్యేందుకు 30 ఏళ్లు పట్టింది..

payyavula
పయ్యావుల కేశవ్ మంత్రి అయ్యేందుకు 30 ఏళ్లు పట్టింది. 1994లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు పయ్యావుల కేశవ్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వై.శివరామిరెడ్డిపై విజయం సాధించారు. అయితే 1999 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 
 
2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయారు. ఆ తర్వాత 2019, 2024 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పయ్యావుల చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1994 నుంచి 2024 వరకు జరిగిన ఏడు సాధారణ ఎన్నికల్లో పయ్యావుల కేవలం రెండుసార్లు మాత్రమే ఓడిపోయారు. 
 
1994 ఎన్నికల్లో పయ్యావుల తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయినా టీడీపీ అధికారంలోకి వచ్చింది. 
 
2004, 2009 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ విజయం సాధించగా, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా పయ్యావుల ఓటమి పాలయ్యారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కేశవ్ గెలిచారు. తాజా ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ విజయం సాధించి, అప్పటి వరకు కొనసాగిన సెంటిమెంట్‌ను బద్దలు కొట్టి మహాకూటమి అధికారంలోకి వచ్చింది.
 
39 ఏళ్ల తర్వాత ఉరవకొండ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కింది. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన గుర్రం నారాయణప్ప 1985లో మంత్రి పదవి చేపట్టగా.. ఆ తర్వాత ఆ పదవి మరెవరికీ దక్కలేదు. ఇన్నాళ్ల తర్వాత టీడీపీ సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌కు కేబినెట్‌ స్థానం దక్కింది. 
 
1994లో తొలిసారి ఎమ్మెల్యే అయిన కేశవ్ మరో నాలుగుసార్లు గెలిచారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు పోటీ చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా కేశవ్ ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా మంత్రి పదవి దక్కలేదు. ఈసారి నియోజకవర్గ ప్రజల కోరికలు తీరుస్తూ కేశవ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు