బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:26 IST)

కారు ఆరు బ‌య‌ట పెట్టామో...పెట్రోల్ హాంఫ‌ట్!!

నగదు, నగలు, సెల్‌ఫోన్ల చోరీ వంటి ఘటనలను గురించి తరచూ మనం వింటూ ఉంటాం.. కానీ, ఇపుడు దొంగలు రూట్‌ మార్చి, పెట్రోల్‌ చోరీలు మొదలెట్టారు. పార్కింగ్‌ చేసి ఉన్న వాహనాలను టార్గెట్‌ చేసి వాటిలోని ఇంధనాన్ని అపహరిస్తున్నారు.

పెట్రోల్ ధ‌ర భ‌గ్గుమ‌న‌డంతో... లీట‌ర్ 120 రూపాయ‌లకు చేర‌డంతో...ఇక దాన్ని దోచుకోవ‌డం మొద‌లుపెట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంతో పాటు యర్రబాలెం, నవులూరు, నిడమర్రు, పెదవడ్లపూడి, కాజ గ్రామాల్లో గత కొంత కాలంగా పెట్రోల్‌ దొంగలు పేట్రేగిపోతున్నారు.

అర్థరాత్రి సమయంలో నివాస గృహాల ఎదుట రోడ్డుపై పార్కింగ్‌ చేసిన ఉన్న ద్విచక్ర వాహనాలను టార్గెట్‌ చేసి పెట్రోల్‌ చోరీ చేస్తున్నారు. తమ బండిలోని పెట్రోల్‌ పోయిందన్న విషయంపై పోలీసులకు ఫిర్యాదులు చేయలేకపోవడం ఇక్క‌డ వారి వీక్ పాయింట్ గా మారింది.

రోజు రోజుకూ ధరలు పెరుగుతుండటంతో, తమ బండిలో మళ్లీ పెట్రోల్‌ కొట్టించుకోలేక సామాన్య, మధ్య తరగతి వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. మంగ‌ళ‌గిరితో పాటు ఆయా గ్రామాల్లో బహుళ అంతస్తుల భవనాలు ఉన్నప్పటికీ కార్లు, ఇతర వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు సౌకర్యం లేదు. దీంతో ఆరు బయటే రోడ్లపై పార్కింగ్‌ చేస్తున్నారు. ఇదే అదనుగా దొంగలు బైకుల్లోని పెట్రోల్‌ను ఎత్తుకెళ్తున్నారు. రాత్రి పార్కింగ్‌ చేసిన వాహనాన్ని ఉదయం స్టార్ట్‌ చేసేందుకు ఎంత ప్రయత్నించినావాహనం కదలడం లేదు. అనుమానం వచ్చి ట్యాంకులో పరిశీలిస్తే, చుక్క పెట్రోల్‌ కూడా ఉండటం లేదు. తమ అవసరం కోసం ఎవరైనా పెట్రోల్‌ దొంగతనం చేసినా, లేక ఆకతాయిలు సరదాగా చోరీ చేసినా వాహనదారులు మాత్రం పలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

పెట్రోల్‌ ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో జరుగుతోన్న పెట్రోల్‌ చోరీ సామాన్యులకు భారంగా మారింది. పెట్రోల్‌ తీయటానికి ఇబ్బందిగా ఉంటే, వాహన పైపులు కోసి మరీ పెట్రోల్‌ను చోరీ చేస్తోండటం కొసమెరుపు. అయితే, ఈ పెట్రోల్ దొంగ‌త‌నాల‌పై పోలీసుల‌ను ప్ర‌శ్నిస్తే, సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. ఒక సీసీ కెమెరా వేయి మంది పోలీసులకు సమానం. గృహాల్లో జరిగే ఎటువంటి తరహా చోరీలకైనా సీసీ కెమెరాల ఏర్పాటుతోనే అడ్డుకట్టపడే అవకాశం ఉంది.

చోరీకి పాల్పడిన నిందితుడిని సీసీ కెమెరా ఫుటేజి విధానం ద్వారా పోలీసులు సులభంగా గుర్తించగలుగుతారు. బాధితులకు కూడా త్వరితగతిన న్యాయం జరుగుతుంది. ప్రతి గృహయజమాని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. లేకుంటే కనీసం ఆయా వీధుల్లోని గృహ యజమానులంతా కలసి అయినా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌ని చెపుతున్నారు.