ఆది శంకరాచార్యుల వారి సంస్మరణలో పుణ్యక్షేత్రాలు...ప్రధాని మోదీ లైవ్!
కేదార్ నాధ్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఆది శంకరాచార్యుల వారి సమాధి పున: ప్రారంభోత్సవం చేశారు. దీనిని పురస్కరించుకుని, ఆది శంకరాచార్యులు నడయాడిన అన్ని పుణ్య క్షేత్రాలలో ఆయన సంస్మరణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ వేడుకలు శంకరాచార్యుల వారు సందర్శించిన అన్ని పుణ్య క్షేత్రాలలో జరుగుతున్నాయి.
ఆయా పుణ్య క్షేత్రాలలో ప్రధాని నరేంద్ర మోదీ కేదార్ నాద్ సందర్శనను లైవ్ లో ప్రదర్శిస్తూ, ఆది శంకరాచార్యుల సంస్మరణ నిర్వహిస్తున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంలో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సంస్మరణోత్సవ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం ఉదయం 7:30 నిమిషాలకు కాశీపేటలోని పెద్ద దేవాలయం వద్ద జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రివర్యులు దగ్గుపాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో ఆది గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సమాధి పునర్నిర్మాణం కార్యక్రమాన్ని నిర్వ హించారు.
కేరళ రాష్ట్రంలోని ఆది శంకరాచార్యుల వారి సమాధిని కాలడిలో పునర్నిర్మాణం సందర్భాన్ని పురస్కరించుకొని, పూర్వం వారు ప్రతిష్ట నిర్వహించిన ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఉదయం 7:30 గంటలకు ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ హాజరయ్యారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి జనార్దన్ రెడ్డి దగ్గరుండి సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చిత్తూరు జిల్లా తిరుమలతోపాటు, ఇంద్రకీలాద్రి పై ఘనంగా జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సంస్మరణోత్సవాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని అన్ని చోట్లా ప్రసారం చేస్తు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.