శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 మే 2021 (10:56 IST)

చకచక పోలవరం ప్రాజెక్టు పనులు.. గోదావరిని దారి మళ్లించారుగా!

పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఈ ఏడాది చివరి కల్లా ఎట్టి పరిస్దితుల్లోనూ పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్న ఏపీ ప్రభుత్వం.. ఈ వర్షాకాలంలో పనులకు అంతరాయం లేకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గోదావరికి వచ్చే వరద నీటిని మళ్లించేందుకు ఈసారి పకడ్బందీ ప్రణాళిక సిద్దం చేసింది. గతంలో వరద నీటి కారణంగా పనులకు ఆటంకం కలగడంతో ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది.
 
పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్టును ఎట్టి పరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్ చకచగా పనులు పూర్తిచేస్తోంది.
 
పోలవరం స్పిల్‌వే నుంచి ఈ వర్షాకాలంలో వరద నీరు మళ్లించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుంచి కుడివైపుకు అధికారులు మళ్లిస్తున్నారు. దీని ద్వారా అప్రోచ్‌ ఛానల్‌ నుంచి స్పిల్‌వే మీదుగా స్పిల్ ఛానల్‌ వరకూ వెళ్లి అక్కడి నుంచి మరలా పైలట్‌ ఛైనల్‌ నుంచి సహజ ప్రవాహంలో గోదావరి నది కలవబోతోంది. 
 
ఈ లెక్కన చూస్తే ఆరున్నర కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహాన్ని దారి మళ్లించబోతున్నారు. దీంతో ఈ సీజన్‌లో ప్రాజెక్టు వద్ద పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఈ సీజన్‌ నుంచే గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.