మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 నవంబరు 2024 (15:08 IST)

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

manohar naidu
వైకాపా నేత, గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక అరండల్ పేట పోలీసుకు టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై పరుష, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శ్రీనివాస రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
గత వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసింది. ఆ సమయంలో టీడీపీ, జనసేన శ్రేణులు అరండల్ పేట ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. అపుడు మనోహర్ నాయుడు అక్కడకు చేరుకుని వీరంగం సృష్టించారు. పోలీసుల వద్ద నుంచి లాఠీ మరీ తీసుకుని టీడీపీ - జనసేన శ్రేణులపట్ల దురుసుగా ప్రవర్తించాడు. అలాగే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను దూషించారు. 
 
దీనిపై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో మనోహర్ నాయుడుతో పాటు పలువురు వైకాపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.